ప్రస్తుత కాలంలో కష్టపడి సంపాదించే వారి కన్నా దొంగతనాలు చేసి సంపాదించేవారే దర్జాగా బతుకుతున్నారు. అందువల్ల కష్టపడకుండానే సులభమైన పద్ధతిలో డబ్బు సంపాదించాలని చాలామంది యువకులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అమాయకులను మోసం చేయటానికి వివిధ రకాలుగా రూపాలు మారుస్తూ దొంగతనానికి పాల్పడుతున్నారు.రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి వద్దకు ఇద్దరు వ్యక్తుల వెళ్లి మేము పోలీసులమని చెప్పి ఆమెనుండి 13 తులాల బంగారం చోరీ చేసిన ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది.
బాధితురాలు తెలిపిన వివరాల మేరకు…సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన నిర్మలకుమారి అనే 65ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంగా ఉండటంవల్ల గురువారం ఆస్పత్రికి వెళ్ళింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు కొన్ని పరీక్షలు రాసి పక్కన ఉన్న ల్యాబ్ లో వైద్య పరీక్షలు చేయించుకోమని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు సమీపంలో ఉన్న ల్యాబ్ కి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగి వస్తున్న సమయంలో ఆమె ఒంటి మీద ఉన్న బంగారం చూసిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ వృద్ధురాలి వద్దకు వెళ్ళి తాము పోలీసులమని చెప్పి నమ్మించారు.
ఒంటరిగా ఉన్న సమయంలో ఒంటిమీద అంత బంగారం వేసుకోవడం మంచిది కాదని వృద్ధురాలిని నమ్మించి తీసి బ్యాగ్ లో పెట్టమని చెప్పారు. వారు చెప్పిన మాటలను నమ్మిన వృద్ధురాలు బంగారం తీసి బ్యాగులో వేయమని వారిని కోరింది. దీంతో ఇద్దరు యువకులు బంగారం బ్యాగులో వేసినట్లు నటించి అక్కడి నుండి వృద్ధురాలిని పంపించేశారు. కొంత దూరం వెళ్ళాక బ్యాగ్ చూసుకున్న వృద్ధురాలు అందులో బంగారం కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం వెల్లడించింది. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు దొంగతనం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.