ఆడపిల్ల పుట్టిందని అదనపు కట్నం డిమాండ్.. అత్తింటి బాధలు తాళలేక వివాహిత ఆత్మహత్యయత్నం!

వివాహం సమయంలో వరకట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ వరకట్నాన్ని సాంప్రదాయంగా భావిస్తున్నారు. దీంతో ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు భారీగా కట్నం ఇచ్చి తమ పిల్లలకి పెళ్లిళ్లు చేస్తున్నారు. అయితే కొంతమంది దుర్మార్గులు మాత్రం పెళ్లి తర్వాత అదనపు కట్నం కావాలంటూ భార్యలను వేధించటంతో వారు మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇటువంటి విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెట్టే బాధలు భరించలేక మహిళ ఆత్మహత్యకి పాల్పడిన ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే…హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దొంగల రాకేశ్‌రెడ్డి కి వరంగల్‌ విశ్వనాథ కాలనీకి చెందిన చిల్కూరు దేవేందర్‌రెడ్డి కుమార్తె భవానిరెడ్డి (25) తో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో దేవేందర్ రెడ్డి వరకట్నం కింద రూ.7లక్షల నగదు, 16తులాల బంగారం, ఇతర సామన్లు ఇచ్చారు. పెళ్లి జరిగిన తర్వాత చాలాకాలం వీరిద్దరూ ఎంతో సంతోషంగా జీవనం సాగించారు. ఈ క్రమంలో భవాని రెడ్డి గర్భం దాల్చి ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కూతురు పుట్టినప్పటి నుండి రాకేష్ రెడ్డి అదనపు కట్నం కోసం భవానీని వేధించేవాడు.

అదనపు కట్నం తెస్తేనే తనతో కాపురం చేస్తానని లేదంటే పుట్టింట్లోనే ఉండమని భవానిని వేధించేవాడు. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీ కూడా రాకేష్ రెడ్డి అతని తల్లిదండ్రులు కూడా భావానికి ఫోన్ చేసి మరి అదనపు కట్నం తీసుకురావాలని హెచ్చరించారు. దీంతో అదనపు కట్నం కోసం భర్త ,అత్తమామలు పెట్టే బాధలు భరించలేక మనస్థాపనతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భవాని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో భవాని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు మొదలుపెట్టారు.