మల్టిప్లెక్స్ థియేటర్ యాజమాన్యాలకు షాక్

మల్టిప్లెక్స్ సినిమా హాళ్ల యాజమాన్యాలకు గట్టి షాక్ తగిలింది. ఇంతకాలం ఎంఆర్పీ రేట్ కంటే నాలుగైదు రెట్లకు తినుబండారాలు, ఆహార పదార్థాలను విక్రయించిన మల్టిప్లెక్స్ యాజమాన్యాలకు విజయవాడ వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు వెలువరించింది. మల్టిప్లెక్స్ సినిమా హాళ్ల లోకి బయటనుంచి జనాలు తెచ్చుకునే ఆహార పదార్థాలను తప్పనిసరిగా థియేటర్లలోకి అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది.

షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్ లకు గూబ గుయ్యుమనేలా తీర్పునిచ్చింది వినియోగదారుల ఫోరం. గత ఏప్రిల్ లో పారదర్శక సమితి అనే సంస్థ షాపింగ్ మాల్స్, సినీ మల్టి ప్లెక్స్ లలో భారీ రేట్లకు తినుబండారాలు విక్రయించడంపై వినియోగదారుల ఫోరం లో ఫిర్యాదు చేశారు. దానికి ఫోరం తీర్పు వెలువడింది.  సీల్డ్ ప్యాక్ లోని తినుబండారాలు, వాటర్ బాటిళ్స్ అనుమతించాలని ఆదేశాలిచ్చింది. మల్టిప్లెక్స్ లలో ఈ ఆదేశాల అమలును తూనికలు కొలతల శాఖకు అప్పగించింది వినియోగదారుల ఫోరం.

విజయవాడలో ఉన్న మల్టిప్లెక్స్ లలో ఎమ్మార్పీ రేటు కంటే భారీగా వసూలు చేస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారని వినియోగదారుల ఫోరం లో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ జరిపి గురువారం తీర్పు వెలువరించింది ఫోరం. ఇప్పటివరకు ఫుడ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ కు భారీ రేట్లపై విక్రయించినందుకు ఆయా మల్టిప్లెక్స్ లకు ఐదు లక్షల జరిమానా కూడా విధించింది.

విజయవాడలోని ఎల్ఇపిఎల్, ట్రెండ్ సెట్, పివిపి, ఐనాక్స్ మల్టిప్లెక్స్ లపై ఈ ఉత్తర్వులు జారీ చేసింది ఫోరం. ఈ ఆదేశాలన్నీ రెండు నెలల తర్వాత నుంచి అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తి.