అసిఫ్ నగర్ సీఐ రాజయ్య కేసు రోజుకో తీరుగా మలుపు తిరుగుతోంది. భార్య ఉండగానే మరో ఇద్దరిరిని పెళ్లి చేసుకున్న రాజయ్య కేసులో ముగ్గురు భార్యలు ఒక్కటయ్యారు. రాజయ్య అందరిని మాయ మాటలతో మోసం చేశారని ఇప్పుడు రేణుకకు జరిగిన అన్యాయమే రేపు తమకు జరగదన్న గ్యారంటీ లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అసిఫ్ నగర్ సీఐ రాజయ్య ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ వచ్చారు. ఇలా ఏకంగా ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకొని పట్టించుకోకుండా వదిలేశాడు. రాజయ్య మూడో భార్య రేణుక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజయ్య అసలు బండారం బయటపడింది. రాజయ్య ముగ్గురిని పెళ్లి చేసుకొని ఇప్పుడు మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. రేణుకకు విషయం తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సరూర్ నగర్ సీఐ విఠల్ రెడ్డి డబ్బులు తీసుకొని కేసు కాంప్రమైజ్ చేశారని రేణుక ఆరోపించింది. దీని పై శుక్రవారం డిజిపిని కలిసి ఫిర్యాదు చేస్తామంది. రాజీకి రాకపోతే బ్లాక్ మెయిలింగ్ కేసు నమోదు చేస్తామని విఠల్ రెడ్డి బెదిరించాడని బాధితురాలు వాపోయింది. సీఐ బెదిరించిన ఫోన్ రికార్డులు, ఆడియో, వీడియో మెసేజ్ లను ఎల్బీ నగర్ రింగ్ రోడ్డులో బయటపెడుతానని బాధితురాలు రేణుక తెలిపింది. ఆ తర్వాత సీఐ రాజయ్య ముగ్గురు భార్యలు డిజిపి ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు.
బాధితురాలికి అండగా నిలవాల్సిన పోలీస్ శాఖ మోసగాడికి అనుకూలంగా వ్యవహరిస్తుందని పలువురు మహిళా సంఘాల నేతలు విమర్శించారు. న్యాయం కోసం పోతే బెదిరింపులకు దిగుతారా అని వారు ప్రశ్నించారు. రాజయ్య చేతిలో మరో మహిళ మోసపోకముందే అతడిని అరెస్టు చేసి జైలుకు పంపాలన్నారు. పోలీస్ ఉద్యోగం చేసుకుంటూ తప్పుడు పనులు చేయడం,దానిని ఆ శాఖ వారు వెనకేసుకురావడం సబబు కాదన్నారు. అతని పై చర్య తీసుకొని బాధితురాళ్లకు న్యాయం చేయాలన్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిని ముగ్గురిని పెళ్లి చేసుకోవడమే కాకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సీఐని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.