నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గవర్నర్ పేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, సిమెంట్ ట్యాంకర్ ను వెనుక నుంచి ఢికొట్టింది. దీంతో బస్సు కండక్టర్ తో పాటు మరో మహిళ ప్రమాదంలో చనిపోయారు. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని నార్కట్ పల్లి కామినేనికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
విజయవాడ గవర్నర్ పేట డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ కు ఆదివారం అర్దరాత్రి బయలు దేరింది. ముత్యాలమ్మ గూడెం వద్దకు రాగానే ముందు ఉన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ముందల ఉన్న సిమెంట్ ట్యాంకర్ కు ఢికొట్టింది. దీంతో కండక్టర్ బస్సు, లారీ మధ్యలో ఇరుక్కొని చనిపోయాడు. ప్రయాణికుల్లోని ఓ మహిళ తీవ్రంగా గాయపడి బస్సులోనే చనిపోయింది. మరో 15 మందికి గాయాలయ్యాయి. వారందరిని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.