దేశంలో రోజురోజుకీ దొంగతనాల కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కష్టపడి డబ్బులు సంపాదించలేని వారు సులువుగా డబ్బు సంపాదించడానికి ఇలా అడ్డ దారుల్లో వెళుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు పోలిసులు కఠిన శిక్షలు అమలు చేసినా కూడా రోజురోజుకీ దొంగతనాల నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. దొంగతనానికి వెళ్ళిన వారు వారికి అడ్డొచ్చిన వారిని హత్య చేసి మరి దొంగతనానికి పాల్పడుతున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దంపతులను హత్య చేసి ఇంట్లో ఉన్న బంగారు నగలు డబ్బు అపహరించారు. ఈ ఘటన ఆదివారం నెల్లూరులో కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు… నెల్లూరు పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వాసిరెడ్డి కృష్ణారావు, సునీత దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. కృష్ణారావు విద్యుత్ శాఖ సమీపంలో శ్రీరామా క్యాంటీన్‌ను నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తి… ఇంటి ప్రధాన గుమ్మం వద్ద కృష్ణారావు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసి కృష్ణారావు హత్య గురించి సమాచారం ఇవ్వగా .. అతడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న నెల్లూరు టౌన్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరి చూడగా కృష్ణారావు గుమ్మం ముందు మరణించి ఉండగా అతడి భార్య సునీత బెడ్‌రూమ్‌లో శవమై కనిపించింది.
ఇద్దరి శరీరాలపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీరిద్దరూ హత్య చేయబడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్య అనంతరం దుండగులు ఇంట్లోని విలువైన బంగారు నగలు, నగదును ఎత్తుకుపోయినట్లు పోలిసులు వెల్లడించారు. అయితే ముందస్తు ప్రణాళికగా ఎవరో బాగా తెలిసిన వ్యక్తులే ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ హత్య ఘటనను దోపిడీ కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నేరం జరిగిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు శనివారం రాత్రి హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.