బెంగుళూరులో దారుణం… నడిరోడ్డుపై యువతి దారుణ హత్య..!

ప్రస్తుత కాలంలో క్రైమ్ రేటు రోజురోజుకి పెరిగిపోతుంది కొందరు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకుంటే మరికొందరు చిన్న చిన్న విషయాలకి ఇతరులను హత్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల వల్ల జరిగే హత్యలు ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటున్నాయి. సినిమాలు సీరియల్ లో ప్రభావం ప్రజల మీద ఎక్కువగా కనిపిస్తోంది. సినిమాలలో ఉన్న క్రైమ్ సీన్లు చూసి దారుణంగా హత్యలు చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో కూడా ఇటువంటి దారుణ సంఘటన. నడిరోడ్డు మీద ఒక ప్రేమోన్మాది యువతిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

వివరాలలోకి వెళితే…ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన లీలా పవిత్ర అనే యువతి శ్రీకాకుళంకు చెందిన దినకర్‌ అనే యువకుడు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు . అయితే వీరి ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారి కులాలు వేర్వేరు కావటంతో తల్లిదండ్రులు వీరి పెళ్లిని వ్యతిరేకించారు. దీంతో తల్లితండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోలేనని పవిత్ర దినకర్‌కు చెప్పింది. రెండు నెలలుగా దినకర్‌ను ఆమె దూరం పెడుతూ వచ్చింది. అప్పటికే దినకర్‌ను వదులుకున్నానన్న బాధతో ఉన్న పవిత్రకు ఇంట్లో మరొకరితో వివాహం కుదిర్చారు. ఈ విషయం తెలిసిన దినకర్ ఆమెను కలవటానికి ఆఫీసు వద్దకు వెళ్ళాడు. ఆమె బయటికి వచ్చిన తరువాత ఈ విషయం గురించి ఆమెను నిలదీశాడు.

దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య చిన్నగా మొదలైన గొడవ చినికిచినికి గాలి వానల పెద్దదైంది. తనను పెళ్లి చేసుకోవాలని దినకర్ ఆమెను పట్టుబట్టాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన దినకర్ తనతో తెచ్చుకున్న కత్తితో పవిత్రను పొడిచేశాడు. సహోద్యోగులు చూస్తుండగానే నడిరోడ్డు మీద కత్తితో పలుమార్లు విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పవిత్ర అక్కడికక్కడే మృతి చెందింది. దాడి చేసిన తర్వాత అక్కడి నుండి పారిపోకుండా దినకర్ ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు . ఈ సంఘటన గురించి సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దినకర్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.