బ్రేకింగ్ న్యూస్: మిర్యాలగూడ మర్డర్ సూత్రదారి మారుతీరావు అరెస్టు

నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలో కలకలం రేపిన  పరువు హత్య కేసులో ఏ1 నిందితుడు మారుతీరావును నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారుతీరావు తమ్ముడు ఏ2 నిందితుడు శ్రావణ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ప్రణయ్ హత్యకు అరగంట ముందే మారుతీరావు మిర్యాలగూడ వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇద్దరు నిందితులను గోల్కోండ పరిధిలో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ గ్యాంగ్ తో మారుతీరావు సుఫారీ ఒప్పందం కుదుర్చుకున్నారు.

హత్యకు రెక్కీ నిర్వహించిన నిందితుడు రెండు సార్లు వేరు వేరు బైక్ లు ఉపయోగించాడు.  రూ.10 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా కొంత అడ్వాన్స్ చెల్లించాడు. పని అయ్యాక మరికొంత చెల్లిస్తానని మారుతీరావు కిరాయి హంతకులతో ఒప్పందం చేసుకున్నాడు. ముందుగా తనే మర్డర్ చేయాలని భావించినా అది కుదరలేదు. మారుతీ రావు ముందుగా అల్లుడు, కూతురితో మంచిగా ఉన్నట్టు నటించి ఫోన్ చేసి మంచి చెడ్డ తెలుసుకునేవాడు. అలా ఎప్పటికప్పుడు వారి కదలికలను గమనించాడు. అమృత గర్బిణి కావడంతో జ్యోతి హాస్పిటల్ లో చూపించుకొని వస్తున్న క్రమంలో దుండగుడు హత్య చేశాడు.  

ప్రణయ్ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. అగ్రకులానికి చెందిన వ్యక్తి దళిత యువకుడిని చంపడాన్ని నిరసిస్తూ దళితులు మిర్యాలగూడ బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ  సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.

అమృత వర్షిణితో తండ్రి మారుతీరావు

మిర్యాలగూడకు చెందిన దళిత యువకుడు ప్రణయ్ తన క్లాస్ మేట్ వైశ్య కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి గొడవలయ్యాయి. అమ్మాయి తండ్రి మారుతీరావే ప్రధాన సూత్రదారి అని కిరాయి హంతకులతో సుపారీ ఇచ్చి చంపారని పోలీసుల విచారణలో తేలింది.  ప్రణయ్ ఇంటి ముందు నిందితుడు 2o రోజుల క్రితమే రెక్కి నిర్వహించినట్టుగా తేలింది. మారుతీ రావు తమ్ముడు శ్రావణ్  కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మారుతీరావును పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.