తండ్రికి అమృత చెంప పెట్టు డెసిషన్

మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్న జంటను విడదీసింది. గర్భవతి అయిన భార్యను విధవను చేసింది. ఇంకా లోకం చూడని బిడ్డకు తండ్రిని దూరం చేసింది. చెట్టంత కొడుకును దూరం చేసి తల్లిదండ్రులకు పుత్ర శోకం మిగిల్చింది.

ఒక దళితుడు తన కూతుర్ని పెళ్లి చేసుకోవడం సహించని రియల్టర్ మారుతీ రావు, అతని తమ్ముడు కలిసి ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించారు. దీనికోసం అక్షరాలా కోటి రూపాయలు సుపారీ ఇచ్చేట్టు డీల్ కుదుర్చుకున్నారు హంతకుడితో. ప్రణయ్ ని చంపింది ఎవరో కాదు. గతంలో మారుతీరావును కిడ్నాప్ చేసిన ఉగ్రవాది. ఇప్పుడు అదే వ్యక్తిని కూతురు భర్తను చంపడానికి వాడుకోవడం విశేషం.

పోలీసుల అదుపులో ఉన్న మారుతీరావు పోలీసులకు విస్తుపోయే విషయాలు వెల్లడించాడు. కూతురికంటే నాకు పరువే ముఖ్యం. జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడే నేను హత్య చేయించాను. అందుకోసం రెండు నెలల నుండే ప్లాన్ లో ఉన్నాము. మొదట ఒక కిరాయి హంతకుడితో డీల్ మాట్లాడుకున్నాం. కానీ రెండుసార్లు హత్యాయత్నం విఫలమైంది. దీంతో నన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తితో ప్రణయ్ ని హత్య చేయడానికి డీల్ కుదరుచుకున్నాం. ప్రణయ్ ని హత్య చేసేటప్పుడు నా కూతురికి హాని జరగకూడదని చెప్పాము. ప్రణయ్ ని హత్య చేశాక అమృతని మా ఇంటికి తీసుకెళ్లాలని ఆలోచనలో ఉన్నాం. అందుకే అబార్షన్ చేయించుకోమని చెప్పాము. ఇదంతా నా కూతురి మీద ప్రేమతోనే చేసాం అని మారుతీరావు చెప్పటం కొసమెరుపు.

అయితే తన తండ్రి చేసిన ఈ పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అమృత. కూతురి మీద ప్రేమతో ఇలా ఎవరైనా చేస్తారా అని ప్రశ్నిస్తోంది. తండ్రే నా జీవితం నాశనం చేశాడు అంటోంది అమృత వర్షిణి. నాకు పూఆటబోయే బిడ్డలో నా భర్తను చూసుకుంటాను అంటోంది. కుల పిచ్చిని అంతం చేసేలా ముందడుగు వేస్తాను అని బలంగా చెబుతోంది. అత్తింటివారు ఒప్పుకుంటే వాళ్లతో నా జీవితం కొనసాగిస్తాను కానీ పుట్టింటికి మాత్రం వెళ్లనంటోంది. పుట్టింటితో సంబంధాలు కొనసాగించను అంటూ కుండబద్దలు కొట్టినట్టు చెబుతోంది.

మా నాన్న ప్రణయ్ ని కొట్టి నన్ను తన నుండి దూరంగా తీసుకెళ్ళిపోతాడేమో అనుకున్నాం కానీ ఇంతటి దారుణానికి ఒడిగడతాడు అనుకోలేదు. ప్రణయ్ ని చంపి నా జీవితాన్ని నాశనం చేశాడు. నాకు తీరని అన్యాయం చేశాడు. మా నాన్నకి  మనుషుల్ని చంపేంత కులపిచ్చి ఉందని అనుకోలేదు. మా బాబాయి కూడా దుర్మార్గుడే. ప్రణయ్ హత్యకు కారకులైన ప్రతి ఒక్కరికి తగిన శిక్ష పడాలి. ఉరికంటే దారుణమైన శిక్ష పడాలి. మరొక్కసారి ప్రేమించుకున్న వారిని కులం పేరిట విడదీయాలంటే భయపడేలా వారికి శిక్ష పడాలి అని ఆమె ఆశిస్తుంది. ప్రణయ్ హత్యలో భాగమైన ప్రతి ఒక్కరికి శిక్ష పడే వరకు నేను పోరాడతాను అంటోంది. అంతే కాదు ప్రణయ్ స్టాచ్యూని మిర్యాలగూడలో ఏర్పాటు చేయాలనీ కూడా ఆమె ప్రధానంగా డిమాండ్ చేస్తోంది.