నాకు బిడ్డపుట్టే లోపు మా నాన్న చావాలి

మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. ప్రణయ్ మరణంతో అంతటా విషాద చాయలు అలుముకున్నాయి. ప్రణయ్ ని అమృత తండ్రి మారుతీరావే సుఫారీ ఇచ్చి చంపించాడని పోలీసుల విచారణలో తేలింది. అమృత ఓ టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేసింది. ఆమె మాటల్లోనే…

మా నాన్నను చంపేయండి. తను బతుకొద్దు. నాకు బిడ్డ పుట్టే లోపు నాన్న చావాలి. అతని నుంచి నాకు, నాకు పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉందని అమృత తెలిపింది.  తమ నాన్నకు వేరే కులం వారు అంటే అసలు నచ్చదని, అమ్మాయిలతో మాట్లాడినా కూడా ఆమె ఎస్పీ, బీసీ ఆమెతో నీకు ఎందుక స్నేహం అని ప్రశ్నించేవారని తెలిపింది.

ప్రణయ్ నా కడుపులో పుడతాడు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అందులో ప్రణయ్ ని చూసుకుంటాను. పుట్టబోయే బిడ్డను క్యాస్టిజానికి వ్యతిరేకంగా పెంచుతాను. డాడీ ప్రణయ్ ని కొట్టి తన నుంచి నన్ను విడదీస్తారని అనుకున్నాను కానీ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారని అనుకోలేదు. నేను పుట్టింది జ్యోతి హాస్పిటల్ లో .. ప్రణయ్ చనిపోయింది జ్యోతి హాస్పిటల్ దగ్గరే. నా బిడ్డ కూడా జ్యోతి హాస్పిటల్ లోనే పుట్టాలి.

9వ తరగతి నుంచి ప్రేమించుకున్నామని… అప్పుడేం ప్రేమ అని కొందరు అంటున్నారని తెలస్తోంది. వారికి నేను చెప్పేది ఒక్కటే . మా మధ్య రిలేషన్ 9వ తరగతిలో ఏర్పడింది కానీ నా పెళ్లికి రెండు సంవత్సరాల ముందు నన్ను హౌజ్ అరెస్టు చేశారు. 2016 జూలై లో మా మధ్య కాంటాక్ట్స్ లేవు. అసలు 9 వ తరగతిలో మా మధ్య పరిచయం ఉన్నప్పటికి మేం దాదాపు 9 ఏళ్ల వరకు కనీసం కలుసుకోలేదు కూడా. మా విషయం తెలిసి పెద్ద మనుషుల్లో కూడా పెట్టారు. అప్పటి నుంచి మేం దూరంగానే ఉన్నాం. అయినా ఏదో అప్పుడప్పుడు కలుసుకునే వారం.

2016 లో మ్యాచెస్ చూస్తున్నప్పటి నుంచి ప్రణయ్ తో దగ్గరయ్యాను. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. అప్పుడు మళ్లీ తెలిసి హౌజ్ అరెస్టు చేశారు. ప్రణయ్ నా కోసం వేచి ఉన్నాడు. అలా ఒకటయ్యి జనవరి 30 న ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నాం. నెల కిందటే వివాహ రిసెప్షన్ జరిగింది. మా డాడీ నా లైఫ్ స్పాయిల్ చేశాడని అమృత వాపోయింది.

డాడీతో పాటు ఈ  హత్యలో పాల్గొన్న వారందరిని ఉరి తీయాలని అమృత తెలిపింది.  నా భర్తను చంపడం నా కళ్ళతో చూశా. నా ముందే దారుణానికి పాల్పడ్డారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు  ఏర్పాటు చేసి వెంటనే వారిని శిక్షించాలి. తండ్రి కావచ్చు కానీ తను చేసింది మాత్రం చాలా ఘోరం. వెంటనే శిక్షపడాలి వారంతా చావాల్సిందే అని అమృత కోరింది.