ఎక్స్ ప్రెస్ టివి చైర్మన్ జయరామ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. జయరామ్ హత్య కేసులో ఇద్దరు పోలీసుల పై ఆరోపణలు నమోదయ్యాయి. వారి సూచన ప్రకారమే రాకేష్ రెడ్డి హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. రాకేష్ రెడ్డికి గత కేసులకు సంబంధించి ఏసీపీ మరియు ఇన్ స్పెక్టర్లతో పరిచయం ఉంది. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని వారికి ఫోన్ చేసి ఈ కేసులో రాకేష్ రెడ్డి వారి సహాయం కోరినట్టు తెలుస్తోంది.
జయరామ్ ను రాకేష్ రెడ్డి దారుణంగా హత్య చేశాడు. వారిద్దరి మధ్య నెలకొన్న గొడవల కారణంతో జయరాంను రాకేష్ రెడ్డి ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిపించి కొట్టాడు. దీంతో హార్ట్ పేషేంట్ అయిన జయరాం అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. దీంతో ఏం చేయాలో తోచక జయరాం డెడ్ బాడీని రాకేష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉంచుకున్నాడు. రాత్రి సమయాన కారులో బాడీనీ ఎక్కించుకొని నందిగామ సమీపాన ఐతవరం రోడ్డు పై కారు ప్రమాదంగా చిత్రీకరించి వదిలేశాడు. దీంతో కేసు కూపీ లాగిన పోలీసులకు సంచలన నిజాలు తెలుస్తున్నాయి.
ఇబ్రహీంపట్నం ఏసీపిగా సుర్కంటి మల్లారెడ్డి పని చేస్తున్నారు. మరో ఎస్ ఐ ఈస్ట్ జోన్ పరిధిలో ఎస్ హెచ్ వోగా పని చేస్తున్నాడు. వీరికి రాకేష్ రెడ్డితో గతంలోనే సంబంధాలున్నాయి. రాకేష్ మీద పలు కేసులు ఉండడంతో ఈ పోలీసులతో రాకేష్ మంచి దోస్తానా చేశాడు. అయితే హత్య చేసిన రోజు కూడా రాకేష్ ఈ ఇద్దరు పోలీసులకు ఫోన్ చేసి మాట్లాడాడు. వారి సూచన మేరకే హత్యకు ప్రమాదంగా చిత్రికరించాడన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఆరోపణలు రావడంతో ఎస్ ఐ పై సీపీ అంజనీకుమార్ చర్యలు తీసుకున్నారు. ఎస్ ఐని ట్రాన్స్ ఫర్ చేసి విచారిస్తున్నారు. ఏసీపీ మల్లారెడ్డి మీద రాచకొండ సీపీ మహేష్ భగవత్ విచారణకు ఆదేశించారు. విచారణ కమిటి ఇచ్చే నివేదిక ఆధారంగా మల్లారెడ్డి మీద పోలీసు శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే పోలీసులు రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి లతో పాటు పోలీసు అధికారుల కాల్ డేటాను పరిశీలించారు.
తన పై ఆరోపణలు రావడంతో ఏసీపీ మల్లారెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారంటే…
“రాకేష్ రెడ్డి మీద పలు కేసులున్నాయి. ఆ సమయంలో నాకు రాకేష్ రెడ్డి పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసి కేసులకు సంబంధించిన విషయాలు మాట్లాడేవాడు. హత్య జరిగిన రోజు నాకు రాకేష రెడ్డి ఫోన్ చేసి గొడవలో ఓ వ్యక్తి కిందపడిపోయాడని చెప్పాడు. కానీ హత్య జరిగిందని నాకు చెప్పలేదు. గొడవ జరిగితే వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పాను. అంతేకానీ అతనికి ఏం చెప్పలేదు. ముందు అసలు నాకు హత్య జరిగిన విషయమే చెప్పలేదు. హత్య జరిగితే ప్రమాదంగా చిత్రికరించే ప్రయత్నం నేనేందుకు చెప్తాను. బాద్యతాయుతమైన పదవిలో ఉండి తప్పుడుగా ప్రవర్తించే వాడిని కాదు. విచారణలో అన్ని తేలుతాయి” అని మల్లారెడ్డి అన్నారు.
ఏసీపీ సుర్కంటి మల్లారెడ్డి స్వగ్రామం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు. గ్రామంలో ఉన్నతునిగా పేరున్న మల్లారెడ్డికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
మొత్తానికి జయరామ్ హత్య కేసు పోలీసులకు సవాల్ గా మారింది. పోలీసు శాఖ వారే ఈ హత్యకు సహకరించారన్న ఆరోపణలు రావడంతో పోలీసు బాసులు సీరియస్ అయ్యారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పేరుతో దూసుకుపోతుంటే క్రిమినల్స్ కు సహకరించారని తేలడంతో పోలీసు శాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి.