పెళ్లీడుకి వచ్చిన కొడుకు తనకు పెళ్లి చేయమని అడుగుతున్నా కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించడంతో యువకుడు కిరాతకంగా తన తండ్రి, పిడతండ్రిని చంపిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలలోకి వెళితే… నిజామాబాద్ జిల్లా మోపాల్ గ్రామానికి చెందిన కర్రోళ్ల పెద్దబ్బయ్య, కర్రోళ్ల నడిపి సాయిలు అనే ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ముళ్లు. పెద్దబ్బయ్యకి ముగ్గురు కొడుకులు . వారు ముగ్గురు బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లారు. అయితే పెద్దబ్బయ్య రెండో కుమారుడు సతీష్ ప్రవర్తనలో మార్పు రావటంతో నాలుగేళ్ల క్రితం కంపెనీ ప్రతినిధులు అతనిని స్వగ్రామానికి పంపించారు.
దీంతో సతీష్ తల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లాలో పలు ఆసుపత్రులలో అతనికి చికిత్స చేయించారు. స్వగ్రామానికి తిరిగి వచ్చిన సతీష్ అప్పటినుండి పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను తరచూ వేధించేవాడు. సతీష్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా అతనికి వివాహం చేయటానికి ఆలోచనలో పడ్డారు. దీంతో సతీష్ ఇటీవల తానే ఒక పెళ్లి సంబంధం కుదుర్చుకొని వచ్చి ఇంట్లో వాళ్లకు ఆ సంబంధం గురించి ఆగస్టు 14వ తేదీన అమ్మాయి తరఫు బంధువులు ఇంటికి వస్తారని కూడా తన తల్లిదండ్రులకు చెప్పాడు.
అయితే పెద్దన్నయ్య గల్ఫ్ లో ఉన్న తన ఇద్దరు కుమారులతో మాట్లాడిన తర్వాత చెబుదామని వారించటంతో గురువారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శుక్రవారం ఉదయం కూడా ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సతీష్ కోపంతో తన తండ్రీ తలమీద కర్రతో దాడి చేయటానికి ప్రయత్నించగా నడిపి సాయిలు అడ్డుకావటంతో అక్కడే ఉన్న పారతో అతని తలపై బలంగా కొట్టడంతో పడిపోయాడు. పెద్దబ్బయ్య అరుస్తూ తన తమ్ముడి కాపాడేందుకు రాగానే, అతనిని కూడా పారతో బలంగా మోదాడు. దీంతో సతీష్ వెంటనే అక్కడినుండి పారిపోయాడు.దెబ్బ బలంగా తగలటంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికులను విచారించారు. తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.