ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోవడానికి ప్రజలు భయపడుతున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు సరైన సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ పనిచేసే నర్సులు స్వీపర్లు అటెండర్లు డాక్టర్లుగా మారి పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో డ్యూటీలో ఉన్న డాక్టర్లు అందుబాటు లేకపోవడంతో పేషంట్లకు అక్కడ పనిచేసే వారే దిక్కు అవుతున్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణీకి అక్కడ ఆసుపత్రిలో పనిచేసే స్వీపర్ ప్రసవం చేసింది. ఈ ఘటనలో అప్పుడే పుట్టిన బిడ్డ మరణించాడు.
వివరాలలోకి వెళితే…కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని కాల్వ గ్రామానికి చెందిన ఓ గర్భిణికి మంగళవారం పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో గ్రామంలోని ఆశా వర్కర్ సహాయంతో ఓర్వకల్లు ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడ వైద్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రిలోనే పని చేస్తున్న ఓ స్వీపర్ ప్రసవం చేసింది. అయితే మగ బిడ్డ పుట్టి మృతి చెందగా తల్లి మాత్రం క్షేమంగా ప్రాణాలతో బయట పడింది. అయితే ప్రసవం చేసేది డాక్టర్ అని మోసపోయిన కుటుంబీకులు లబోదిబోమంటున్నారు.
మంగళవారం పురిటి నొప్పులతో ఆసుపత్రిక వెళ్ళిన గర్భిణీ కి అక్కడ పనిచేసే స్వీపర్ వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటే గర్భిణీ కుటుంబ సభ్యులు ఆమె డాక్టర్ అని మోసపోయామని వెల్లడించారు. తాము కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వెళ్తామని చెప్పినా కూడా స్వీపర్ వినకుండా ప్రసవం చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్వీపర్ ప్రసవం చేయటంతో మగ బిడ్డ పుట్టిన వెంటనే మరణించాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఇలా ప్రసవం చేసిన స్వీపర్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి సమయాలలో వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగుల పరిస్థితి ఇలాగే ఉంటుందని చుట్టుపక్కల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు