గర్భిణిపై దారుణానికి ఒడిగట్టారు కొందరు ఆకతాయిలు. రైలులో భర్త ఎదురుగానే మహిళని లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. ఆకతాయిల నుండి తప్పించుకోడానికి భార్యాభర్తలు చేసిన ప్రయత్నం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.
బీకే సరాయ్(22 ), పింకిరాయ్ (19 ) భార్యా భర్తలు. వీరి స్వస్థలం పశ్చిమ బెంగాల్, అలంపూర్ జిల్లా, జైగామ్ గ్రామము. వీరిద్దరూ సికింద్రాబాదులో ప్రయివేటు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పింకిరాయ్ మూడు నెలల గర్భవతి. ఆదివారం సొంత ఊరు వెళ్ళడానికి సికింద్రాబాద్-గౌహతి రైలులో జనరల్ బోగీ ఎక్కారు. సుమారు 3 గంటల ప్రయాణం తరవాత అదే బోగీలో ఉన్న బీహార్ యువకులు పింకిరాయ్ తో అసభ్యకరంగా ప్రవర్థన్చడం మొదలెట్టారు. భర్త ఎదుటే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
పింకిరాయ్ భర్త బీకేసరాయ్ వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆ ఆకతాయిలు మరింత రెచ్చిపోయారు. వేధింపులస్థాయిని పెంచారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ జంట రైలు దిగిపోవడమే బెటర్ అనుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవరుపేట రైల్వేస్టేషన్ చేరుకుంది రైలు. కానీ అక్కడ స్టాప్ లేదు. అయినప్పటికీ రైలు కొంచం నెమ్మదిగా నడుస్తుండటంతో భార్యాభర్తలిద్దరూ రైలు నుండి ప్లాట్ ఫారంపైకి దూకేశారు.
అదుపు తప్పడంతో పింకిరాయ్ కిందపడిపోయింది. ఆమె తలకు బలమైన గాయం అయింది. అక్కడే ఉన్న ప్రయాణికులు ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల వెనుక భాగం పుర్రె పగిలిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనపై ఏలూరు ఆర్పీఎఫ్ సీఐ బి.రాజు విశాఖ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన విశాఖ రైల్వే పోలీసులు రైలు విశాఖపట్నం చేరుకోగానే అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది మందిని అరెస్టు చేసి ఏలూరుకు తీసుకొస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.