దొంగలకు సద్దులు మోస్తున్న సూర్యాపేట పోలీసులపై వేటు

సూర్యాపేట జిల్లాలో అవినీతి పోలీసులపై వేటు పడింది. హూజుర్ నగర్ సర్కిల్ పరిధిలో రేషన్ బియ్యం, గుట్కా ప్యాకెట్ల అక్రమ రవాణా దారులకు పోలీసులు సహకరిస్తున్నారన్న  ఆరోపణలు ఉన్నాయి. చిన్న వ్యాపారులపై కేసులు పెడుతూ పెద్ద వ్యాపారులకు పోలీసులు సహకరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీసు అధికారులకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారించిన ఐజీ స్టీఫెన్ రవీంద్ర నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. సీఐ నరసింహారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బలరాం రెడ్డి, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, కమలాకర్ లను సస్పెండ్ చేస్తూ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, లంచం అడిగితే ఫిర్యాదులు చేయండంటూ ప్రభుత్వం పోలీసు అధికారులు చెబుతున్నా కింది స్థాయి పోలీసులలో మార్పు రావటం లేదని వ్యాపారులు అంటున్నారు. నలుగురు పోలీసుల సస్పెన్షన్ తో డిపార్ట్ మెంట్ లో ఈ అంశం చర్చనీయాంశమైంది.