దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు శుక్రవారం (అక్టోబర్ 9) భారీగా పెరిగాయి. ఉదయం ప్రారంభంలోనే బంగారం 0.8 శాతం ఎగిసి 10 గ్రాముల పసిడి రూ.50,584 పలికింది. మధ్యాహ్నం సమయానికి 1.02 శాతం లేదా రూ.511 పెరిగి రూ.50,686కు చేరుకుంది. వెండి ఫ్యూచర్స్ రూ.985 వరకు పెరిగి కిలో రూ.61,605 పలికింది. అంతకుముందు సెషన్‌లో బంగారం రూ.142 పెరిగింది. వెండి 0.17 శాతం లాభపడింది. ఆగస్ట్ 7న పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200, వెండి కిలో రూ.79 వేల పైకి చేరుకుంది.
ఎంసీఎక్స్‌లో బంగారం ధర రూ.50,300 వద్ద ప్రారంభమైంది. ఓ సమయంలో రూ.50,723 గరిష్ట ధర పలికింది. కనిష్టం రూ.50,300 పలికింది. ఎంసీఎక్స్‌లో కీలక మద్దతు రూ.49,920. రూ.50,220ని నిలబెట్టుకుంటే రూ.50,380-రూ.50,500 స్థాయి వద్ద పరీక్షను ఎదుర్కోవచ్చునని, వెండి మద్దతు ధర కిలో రూ.59,500. రూ.60,600ను నిలబెట్టుకుంటే రూ.61,300-రూ.61,900 స్థాయిలో పరీక్షను ఎదుర్కోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.
అనిశ్చితిలో పడిన కరోనా ఆర్థిక ప్యాకేజీపై చర్చలు తిరిగి ప్రారంభం కావడంతో అమెరికా స్టాక్స్ బలపడ్డాయి. అయితే ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ వ్యాల్యూ బలహీనపడింది. డాలర్ సూచీ 0.2 శాతం క్షీణించింది. ఎన్నికలు ముగిసే వరకు ప్యాకేజీపై చర్చలు లేవని తొలుత ప్రకటించిన అధ్యక్షులు ట్రంప్ ఆ తర్వాత చర్చకు మొగ్గు చూపారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ 1.25 శాతం ఎగిసి 1,985 డాలర్లు పలికింది. స్పాట్ గోల్డ్ 0.3 శాతం లాభపడి 1,898.31 వద్ద స్థిరపడింది. ఈ సెషన్‌లో 1,898.10 డాలర్ల వద్ద ప్రారంభమైన పసిడి ధర 1,898.10 – 1,921.95 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 1,895.10 వద్ద క్లోజ్ అయింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.4 శాతం పెరిగి 23.93 డాలర్లు, ప్లాటినమ్ 0.6 శాతం లాభపడి 867.06 డాలర్లు, పల్లాడియం 0.3 ఎగిసి 2,379.29 డాలర్లు పలికాయి.