శర్వానంద్ మరీ ఇంత దిగులుగానా..లైట్ తీసుకో బాస్

చూస్తూంటే శర్వానంద్ ..తన తాజా చిత్రంపై వచ్చిన రిజల్ట్ విషయమై బాగా డిజప్పాయింట్ అయినట్లున్నారు. ఆ విషయం ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో కనిపించింది. సక్సెస్ మీట్ అంటూ ఈ ప్రెస్ మీట్ పెట్టినా ఆయన మొహంలో ఆ నిరాశ స్పష్టంగా కనపడింది. సినిమాపై ఆయన పెట్టుకున్న ఆశలన్ని కూలిపోయినట్లు నిర్వికారంగా మాట్లాడారు. శర్వానంద్ కెరీర్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి..వెళ్లాయి కానీ ఎప్పుడూ ఆయన ఇంతలా మాట్లాడలేదని ఈ ప్రెస్ మీట్ చూసిన వారంతా కామెంట్ చేస్తున్నారు.

శ‌ర్వానంద్, సాయిప‌ల్లవి హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘ప‌డిప‌డి లేచె మ‌న‌సు’. టాలెంటెడ్ డైరెక్టర్ హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 21న విడుద‌లైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో శ‌ర్వానంద్ మాట్లాడుతూ.. ‘‘సినిమా అంగీక‌రించే ముందు ఓ గుర్తుండిపోయే మంచి సినిమా అవుతుంద‌ని న‌మ్మాను. ఇప్పుడు అదే న‌మ్మకంతో ఉన్నాం. నా ఆల్బమ్‌లో ప‌డి ప‌డి లేచె మ‌న‌సు నా సినిమా అని గ‌ర్వంగా చెప్పుకునేలా ఉంటుంది.

చాలా మంది ఫోన్ చేసి మంచి సినిమా బాగుంద‌ని అంటున్నారు. క్రిటిక్స్ అందరికీ థాంక్స్. మీకు అనిపించింది రాశారు. మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. మంచి సినిమాలకు మంచిగా రాశారు, చెడు రాశారు. మీ అందరినీ ఇంప్రెస్ చేయడానికి నెక్ట్స్ టైమ్ తప్పకుండా ప్రయత్నిస్తాను అన్నారు.

అలాగే చూసిన వారు ప్రథ‌మార్థం అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ద్వితీయార్థంలో కొన్ని లోపాలున్నాయి అంటున్నారు. వాటిని స‌రిదిద్దుకుంటూ ముందుకు సాగ‌డ‌మే నా ప‌ని. మంచి సినిమాతో మ‌ళ్లీ మీ ముందుకు వ‌స్తాను. ఈ సినిమాను ఆద‌రిస్తున్న ప్రేక్షకుల‌కు థ్యాంక్స్..’’ అని అన్నారు.