‘చిత్రలహరి’ కలెక్షన్స్: ఎంతొచ్చింది..సేఫేనా?

వరుసగా ఆరు ఫ్లాప్‌లు తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌కి కాస్త రిలీఫ్ వచ్చినట్లే ఉంది. అతని గత చిత్రాలతో పోలిస్తే ‘చిత్రలహరి’కి డీసెంట్‌ ఓపెనింగ్స్‌ వచ్చి ఆనందపరిచాయి. అతని గత రెండు చిత్రాల రిజల్ట్ చూసిన ట్రేడ్ ..ఇక ప్రేక్షకులు సాయిని పట్టించుకోవడం లేదనే ఫీలింగ్‌ కలిగింది. కానీ ‘చిత్రలహరి’కి టాక్‌ యావరేజ్‌గా వచ్చినా కానీ వసూళ్లు బాగుంటుడంతో సాయి కు మంచి రోజులు ప్రారంభమయ్యాయి అంటున్నారు.

మొదటి రోజు ఓపినింగ్స్ బాగున్న ఈ చిత్రానికి రెండో రోజు పదిహేను శాతం వరకూ కలెక్షన్స్ డ్రాప్ కనపడిందని ట్రేడ్ వర్గాల అంచనా. రెండో రోజు డిస్ట్రిబ్యూటర్ షేర్ 2.36 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో రెండు రోజులకు కలిపి 5.38 కలెక్ట్ చేసినట్లైంది. నైజాం, ఉత్తరాంధ్రలో స్టడీగా ఉంది. తూలుడు లేదు. మిగతా చోట్ల రన్నింగ్ ఫుల్స్ అవుతున్నాయి. ఈ వీకెండ్స్ దాటాక కూడా ఇదే పరిస్దితి ఉంటే హిట్ జోన్ లోకి వెళ్లిపోతుంది. సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలు కానుంది.

దానికి తోడు తక్కువ రేట్లకి సినిమా అమ్మడం వల్ల ఈ చిత్రం రికార్డ్ లు క్రియేట్ చేయకపోవచ్చు కానీ ఈజీగా సేఫ్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. తన పేరులోంచి ధరమ్‌ తీసేసి సాయి తేజ్‌గా మారిన మెగా మేనల్లుడికి ఈ పేరు కలిసి వచ్చినట్టుగానే వుంది.

ఇక చిత్రలహరికి ప్రేక్షకుల నుంచి స్పందన బాగుండడంతో తేజ్‌ ప్రమోషన్స్‌ ప్రారంభించాడు. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచిన పాటలు, విడుదలకి ముందు రేకెత్తించిన ఆసక్తి చిత్రలహరికి బోనస్‌గా మారాయి. మార్కెట్లో మజిలీ రూపంలో మరో ఆప్షన్‌ వున్నా కానీ చిత్రలహరి ఉనికి చాటుకోగలిగింది. అయితే వచ్చే వారం జెర్సీ రిలీజ్‌ అవుతోంది కనుక ఈలోగా సక్సెస్‌ తీరం చేరిపోతే బాగుంటుంది.

జీవితంలో లో అపజయాలను చూసే వ్యక్తి పాజిటివ్ ఆలోచనలతో ఎలా ముందుకు సాగాడు అనే పాయింట్స్ దర్శకుడు తెరపై తనదైన శైలిలో ప్రజెంట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే నివేత పేతురాజ్ సాయికి హెల్ప్ చేసే క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఇక సునీల్ ఒక క్రిస్టియన్ సింగర్ పాత్ర చేశాడు. ఇవి రెండు సినిమాకు హైలెట్ గా నడిచాయి. సాయి కూడా చాలా మెచ్యూర్డ్ గా చేసాడు. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది.