అఫీషియల్ :‘ఆర్‌ఆర్‌ఆర్‌’రిలీజ్ డేట్ ఫిక్స్‌!

ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(వర్కింగ్‌ టైటిల్‌) విడుదల తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసింది. 2020 జులై 30 ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సినిమాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు సమాధానం ఇచ్చారు.

దానయ్య మాట్లాడుతూ..భారతదేశం గర్వించే దర్శకుడు రాజమౌళితో సినిమాను తెరకెక్కించడం నా అదృష్టం. రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. అహ్మదాబాద్‌, పుణెలో మరో షెడ్యూల్‌ ఉంది. భారీ బడ్జెట్‌తో తీస్తున్నాం. ఎక్కడా రాజీపడటంలేదు. సినిమాను 2020 జులై 30 తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇతర దేశాల నుంచి కూడా రిక్వెస్ట్స్‌ వస్తున్నాయి. అన్ని భారతీయ భాషల్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌చేస్తున్నాం.’’అన్నారు.

అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరోయిన్ అలియా భట్‌, డైసీ ఎడ్గర్‌ జోన్స్‌, సముద్రఖని, అజయ్‌దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలియచేసారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా, ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాతి షూటింగ్ ను కోల్‌కతాలో జరుపుకోనుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.