‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’: ఓవర్ సీస్ రైట్స్ రేటు విని బయ్యర్లు పరార్?

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రీసెంట్ గానే షూటింగ్ మొదలై శరవేగంగా జరుగుతోంది. అన్ని భారతీయ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా అనుకున్న విధంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో అందరికీ షాక్ ఇస్తోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ కోసం సినిమా దర్శక నిర్మాతలు 75 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. బాహుబలి విజయం దృష్టిలో పెట్టుకుని ఈ స్దాయి రేట్లు అడుగుతున్నారని అంటున్నారు. అయితే బాహుబలికు ఉన్న స్పాన్ వేరు…ఈ సినిమా వేరు అని 75 కోట్లు అంటే చాలా పెద్ద మొత్తం అని అంటున్నారు. చాలా ఉత్సాహంగా రైట్స్ తీసుకుందామని వచ్చిన బయ్యర్లు వెనకడుగు వేస్తున్నారట. నిర్మాతలు కూడా ఒకరికే మొత్తం రైట్స్ ఇస్తామని చెప్తున్నారట. మరి అంత మొత్తం వెచ్చించి  రైట్స్ తీసుకునే ఓవర్ సీస్ బయ్యర్ ఎవరా అనేది ఇప్పుడు ప్రశ్నార్దకంగా మారింది.

సాధారణంగా స్టార్ హీరో చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకి కలిపి ఈ స్దాయి రేటు కోట్‌ చేస్తుంటారు. అయితే కేవలం ఒక్క ఓవర్ సీస్ కే ఇంత అడిగితే ఇంక తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ స్దాయి బిజినెస్ చేస్తారో అని లెక్కలు వేస్తున్నరు. బాహుబలి చిత్రానికి రిలీజ్ కు ముందు వచ్చినంత హైప్‌ కానీ ఈ సినిమాకు వస్తుందా, ఇతర భాషల్లోను ఈ చిత్రానికి క్రేజ్‌ ఏర్పడుతుందా అనేది డిస్ట్రిబ్యూటర్స్ లో కలుగుతున్న సందేహం. దాంతో అంత రేటు పెట్టి కొంటే రికవరీ ఉంటుందా అని అంచనాలు వేస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ తదుపరి షెడ్యూల్ కోసం కోల్ కతా వెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది ఈ చిత్ర బృందం. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ల గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.