ఎన్టీఆర్ బయోపిక్ సీరీస్ లో రెండో పార్ట్ మహానాయకుడు శుక్రవారం రోజున ధియోటర్స్ లో దిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ వంటి హడావుడి ఏమి లేకుండా సినిమాను రిలీజ్ చేయటంతో పెద్దగా బజ్ ఏర్పడలేదు. రాజకీయాలకు సంబంధించిన సినిమా కావడంతో… రిలీజ్ కు ముందు అంచనాలు భారీగా ఉన్నాయి.
కథానాయకుడు సినిమాలో చేసిన తప్పులను మహానాయకుడులో చేయకుండా చూసుకొని రిలీజ్ చేసారని అంతా భావించారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా వసూళ్ల విషయంలో కథానాయకుడు కంటే ఘోరంగా విఫలమవటం అందరికీ షాక్ ఇచ్చింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం…ఎన్టీఆర్ మహానాయకుడు చాలా చోట్ల అద్దెలు కూడా రాబట్టలేకపోయింది. కలెక్షన్స్ చూస్తే అతి పెద్ద డిజాస్టర్ గా నమోదు అయ్యింది.
లెక్కల్లోకి వెళితే..మహానాయకుడు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు కేవలం రూ.1.65 కోట్ల రూపాయలు మాత్రమే వసూళ్లు సాధించింది. భారీ వసూళ్లు వస్తాయని అనుకుంటే ఇలా అతి తక్కువ వసూళ్లు రావడాన్ని యూనిట్ జీర్ణించుకోలేకపోతోన్నది. ఇప్పటికైనా ఈ సినిమాను ప్రమోట్ చేస్తే నష్టాల నుంచి బయటపడొచ్చు.
అలాగే ఈ చిత్రం తొలి భాగం కథానాయకుడు సినిమా 50 కోట్ల వరకు నష్టాలు నిర్మాతలకు తీసుకొచ్చింది. కానీ మహానాయకుడు ఆ నష్టాలను భర్తీ చేయడం మాట అటుంచి కొత్త నష్టాలు తీసుకొస్తుందనే నిర్ణయానికి వచ్చేసారు డిస్ట్రిబ్యూటర్స్.