నందమూరి తారక రామారావు జీవితాధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘యన్.టి.ఆర్.’ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం ‘కథానాయకుడు’ ఈ నెల 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. దాంతో రెండో భాగం ‘మహానాయకుడు’ గురించి రకరకాల టాపిక్స్ మీడియాలో మొదలయ్యాయి. రిలీజ్ డేట్ ఇప్పడిప్పుడే పెట్టరంటూ కొందరు రూమర్స్ క్రియేట్ చేసారు.
ఫిబ్రవరి 7న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ మొదట ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా మరో వారం ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ‘మహానాయకుడు’ సినిమాకు సంబంధించిన పనులు అనుకున్న తేదీకి పూర్తికాకపోవడంతోనే సినిమా విడుదలను వాయిదా వేశారని చెప్తున్నారు. దీంతో ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ఖరారు చేసింది.
ఎన్.బి.కె ఫిల్మ్స్, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’లో ఎన్టీఆర్ సినీ ప్రస్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ప్రకటన వరకూ చూపించారు.
సెకండ్ పార్ట్ ‘మహానాయకుడు’లో ఆయన ఎలా పార్టీని స్థాపించారు? ప్రజాదరణతో ఎలా ముఖ్యమంత్రి అయ్యారు? తదితర పరిణామాలను చూపించనున్నారు. తొలి భాగంతో పోలిస్తే, రెండో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబునాయుడు పాత్రలో రానా ఈ రెండవ భాగంలో ఎక్కువ సేపు కనపడతారు.