‘గీతగోవిందం’ రికార్డులను బ్రేక్ చేసిన బాలయ్య

ఆశ్చర్యపోతున్నారా..బాలకృష్ణ ఏంటి విజయ్ దేవరకొండ సూపర్ హిట్ చిత్రం ‘గీతగోవిందం’ రికార్డ్ ని బ్రద్దలు కొట్టడం ఏమిటని. కానీ నిజం…తాజాగా విడుదలయిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఈ రికార్డును బ్రేక్ చేసింది. ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా 5,18,126 డాలర్ల (దాదాపు మూడున్నర కోట్ల రూపాయలకు పైగానే) కలెక్షన్లను కొల్లగొట్టింది. దీంతో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా రికార్డును బ్రేక్ చేసినట్లయింది.

దీంతోపాటు ఇటీవల విడుదలయిన సూపర్ హిట్ సినిమా ‘గీతగోవిందం’ ప్రీమియర్ షో రికార్డును కూడా ఎన్టీఆర్ కథానాయకుడు బ్రేక్ చేసింది. గీత గోవిందం సినిమాకు ప్రీమియర్ షోల ద్వారా 4,04,000 డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తానికి గౌతమిపుత్ర శాతకర్ణి, గీతగోవిందం సినిమాల ప్రీమియర్ షోల రికార్డులను బ్రేక్ చేసి.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఓవర్సీస్‌లో కూడా హిట్‌టాక్‌ను సంపాదించుకుంది.

సంక్రాతి సీజన్ లో ముందుగా వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్ నటించిన ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీతం అందించగా, రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు.

నందమూరి కల్యాణ్‌రామ్, రానా, సుమంత్, ప్రకాశ్‌రాజ్, రకుల్ ప్రీత్‌సింగ్, నిత్యామీనన్, బ్రహ్మానందం.. ఇతర భారీ తారగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు అమెరికాలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా ఈ సినిమా విడుదలయిన సంగతి తెలిసిందే. యూఎస్ తెలుగు మూవీస్ డిస్ట్రిబ్యూషన్‌లో దాదాపు 200 స్క్రీన్లలో అమెరికాలో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ రిలీజైంది.

సాధారణంగా అమెరికాలో బాలకృష్ణ సినిమాలకు పెద్దగా మార్కెట్‌ లేదు. ఫ్యామిలీ, క్లాస్ సినిమాలను ఎక్కువగా చూసే ఎన్నారైలు.. మాస్ హీరో అయిన బాలయ్య సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపరు. కానీ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నుంచి బాలయ్య సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ పెరిగింది.

మొట్టమొదటి సారి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు 3,73,000 డాలర్లు ప్రీమియర్ల ద్వారానే కలెక్ట్ అయ్యాయి. ఓవరాల్‌గా ఈ సినిమా 1.66 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి.. బాలయ్యకు మొట్టమొదటి మిలియన్ డాలర్ల సినిమాగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన బాలయ్య సినిమాలు ఏవీ అమెరికాలో ఈ స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయాయి.