ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య సంఘటనల ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే సంచలనాలకు కేంద్ర బింధువుగా మారిన ఈ సినిమాని మార్చి 29న విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఈ రిలీజ్ డేట్ మార్చటం వల్ల ఏమన్నా రిజల్ట్ పై పడుతుందా అని సినీ, రాజకీయ సర్కిల్స్ లో చర్చలు వాడి వేడిగా జరుగుతున్నాయి.
తొలి నుంచి చిత్రాన్ని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమాను ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ త్వరలో ఏపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సినిమాను విడుదల చేయడం సబబు కాదని పలువురు తెదేపా కార్యకర్తలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో సినిమా విడుదలను నిలిపివేయాలని సెన్సార్ బోర్డు చిత్రబృందాన్ని ఆదేశించింది.
దాంతో వర్మ సెన్సార్ బోర్డుతో చర్చలు జరిపి విడుదల తేదీని 29కి మార్చారు. త్వరలో కడపలో జరిగే ఓ బహిరంగ సభలో ఈ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుకను నిర్వహిస్తానని వర్మ ప్రకటించారు.
ప్రమోషన్ విషయంలో వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసందే. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ చిత్రంకు సంబంధించి మరో ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.
ఎన్టీఆర్ జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ తెరకెక్కించిన బయోపిక్‌లో చూపించని ఎన్నో ఈ నిజాలు ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆడియన్స్.