‘ఎన్టీఆర్’రికార్డ్స్ మొదలు:‘గౌతమి పుత్ర శాతకర్ణి’ని దాటేసింది

ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ‘ఎన్టీఆర్ బయోపిక్’ ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. తొలి భాగం ‘ఎన్టీఆర్ కథానాయడు’ ఈ రోజే (జనవరి 9న) విడుదలై దేశ విదేశాల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్ నటించారు.

నందమూరి కల్యాణ్‌రామ్, రానా, ప్రకాశ్ రాజ్, నరేష్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్.. వంటి భారీ తారాగణం కలిగిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. అమెరికాలో కూడా పెద్ద సంఖ్యలో స్క్రీన్లలో విడుదలయింది. తెలుగు రాష్ట్రాల కంటే ముందుగానే జనవరి 8న అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా రిలీజైంది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ ని చూస్తే..‘గౌతమి పుత్ర శాతకర్ణి’ని బీట్ చేసింది ‘ఎన్టీఆర్’.

నిన్న (మంగళవారం) ఉదయం నుంచి నేటి ఉదయం వరకు ప్రదర్శించబడిన ప్రీమియర్ షోస్ ద్వారా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ 4,40,000 డాలర్లు అంటే సుమారు 3,09,87,000 రూపాయలు రాబట్టినట్లు ట్రేడ్ లో లెక్కలు వేసి తేల్చారు.

ఈ మొత్తం.. ఇదే బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో వచ్చిన గత సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ కంటే ఎక్కువ కావటం విశేషం. అప్పుడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా అమెరికాలో వేసిన ప్రీమియర్‌ షోస్ ద్వారా 3,75,000 డాలర్లు అంటే 2,64,14,812 రూపాయలు రాబట్టింది.

ఎన్టీఆర్ బయోపిక్‌ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలయ్య.. లీడ్ రోల్ పోషిస్తూ స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. క్రిష్ డైరెక్షన్ సినిమాకు బాగా ప్లస్ అయిందని ఇనానమస్ టాక్ వినిపిస్తోంది. చిత్రంలో నటీనటులంతా ఆయా పాత్రల్లో ఒదిగిపోయారని రివ్యూలు వస్తున్నాయి. సినిమాని చూసినవారంతా ఎన్టీఆర్‌గా బాలయ్య నటనకు ఫిదా అవుతున్నారు. కలెక్షన్స్ పరంగానూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది.