మూడురోజుల్లేనే ఇస్మార్ట్ సేఫ్ గేమ్
యంగ్ హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ మూవీ `ఇస్మార్ట్ శంకర్` ఊహించిన దాని కంటే బెటర్ రిజల్ట్ అందుకోబోతోందా? అంటే అవుననే ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 17కోట్ల మేర ప్రీబిజినెస్ రూపంలో టేబిల్ ప్రాఫిట్స్ చేసిందని పంపిణీ వర్గాల్లో చర్చ సాగింది. అయితే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వాలంటే ఇస్మార్ట్ శంకర్ థియేట్రికల్ కలెక్షన్స్ ఎలా ఉండబోతోన్నాయోనన్న ఆసక్తికర చర్చ సాగింది. ఈ సినిమాపై తొలిరోజు(జూలై 18) క్రిటిక్స్ స్పందనకు అతీతంగా ఓపెనింగ్స్ దక్కడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రివ్యూల్లో మిశ్రమ స్పందనలు వచ్చినా తొలి వీకెండ్ ఈ సినిమా చక్కని వసూళ్లు సాధించి సేఫ్ అవుతుందని విశ్లేషిస్తున్నారు. ట్రేడ్ సమాచారం ప్రకారం.. డే1 `ఇస్మార్ట్ శంకర్` వసూళ్లు ఇలా ఉన్నాయి.
తొలి మూడురోజుల్లో సేఫ్ అవుతాడా?
ఇస్మార్ట్ శంకర్ తొలిరోజు దాదాపు 8.44 కోట్లు వసూలు చేసింది. నైజాం 3.10 కోట్లు, సీడెడ్ 1.20 కోట్లు, వైజాగ్ 85లక్షలు, గుంటూరు- 57లక్షలు, తూర్పు గోదావరి జిల్లా 50లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా 40లక్షలు, కృష్ణ 52లక్షలు, నెల్లూరు 30లక్షలు, యూఏ-86లక్షలు కలెక్ట్ చేయగా.. ఆంధ్రా తెలంగాణ కలుపుకుని 7.44కోట్లు వసూలైంది. ఇతర భారతదేశం నుంచి మరో 40లక్షలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ బాక్సాఫీస్ నుంచి చక్కని రిపోర్ట్ అందింది. ఈ సినిమా ఉత్తర అమెరికాలో రామ్ కెరీర్ నంబర్ 2 గా రికార్డులకెక్కింది. రామ్ నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ
అమెరికాలో డే1లో 105 కె డాలర్లు వసూలు చేయగా.. ఇస్మార్ట్ శంకర్ 55 లొకేషన్ల నుంచి 52కె డాలర్లు మొదటి రోజు వసూలు చేసిందని సీనియర్ జర్నలిస్ట్.. సమీక్షకుడు జీవీ వివరాలు అందించారు. అమెరికాలో మూవీ పాస్ ఫార్మాట్ సినిమాల వసూళ్లకు కలిసొస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇస్మార్ట్ శంకర్ తొలి మూడు రోజుల్లోనే 20కోట్ల షేర్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్రలోనూ ఇస్మార్ట్ శంకర్ హవా సాగుతోందని థియేటర్ యజమానుల నుంచి సమాచారం అందింది. ఇది ఫ్లాపుల్లో ఉన్న రామ్.. పూరి .. ఛార్మి బృందానికి శుభవార్త అనే చెప్పాలి.