అదే భయం: ఎన్టీఆర్ బయోపిక్…టార్గెట్‌ను రీచ్ అవుతుందా..?

ఈ రోజు (జనవరి 9న) విడుదల అయిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా గురించి తెలుగు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ మరణానంతరం దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆయన బయోపిక్‌ తెరకెక్కింది. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమాని భారీ రేట్లకు అమ్మారు.

మరీ ముఖ్యంగా అమెరికాలో.. యూఎస్ తెలుగు మూవీ సంస్థ.. డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీ మొత్తానికి చేజిక్కించుకుంది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసారు డిస్ట్రిబ్యూటర్లు. బాలకృష్ణ నటించిన సినిమాల్లో.. ఒకే ఒక్క సినిమా ఇప్పటివరకు ఓవర్సీస్‌లో ఒక మిలియన్ డాలర్ కలెక్షన్లను కొల్లగొట్టింది. అదే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి. ఆ తర్వాత వచ్చిన బాలయ్య సినిమాలేవీ ఆ సినిమా రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి.

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా 1.66 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. ఈ రోజు సినిమా రిలీజ్ తర్వాత వస్తున్న టాక్ ని బట్టి ఎన్టీఆర్ బయోపిక్.. ఆ రికార్డును దాటుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విడుదలయిన మొదటి రోజే ఒక మిలియన్ డాలర్ కలెక్షన్లను దాటడం ఖాయమని డిస్ట్రిబ్యూటర్లు అంచనాలు వేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్, హరికృష్ణగా కల్యాణ్‌రామ్ నటించారు. రానా, సుమంత్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్, నరేష్, ప్రకాశ్‌రాజ్, కైకాల సత్యనారాయణ వంటి భారీ తారాగణంతో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్‌ రూపొందింది.

ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. సినీ జీవితాన్ని మొదటి భాగంలో, రాజకీయ జీవితాన్ని రెండో బాగంలో చూపిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో నెల రోజుల గ్యాప్‌లోనే రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.