బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా.. నానా పటేకర్‌పై చేసిన లైంగిక ఆరోపణల వివాదం కేసు గురించి తెలిసిందే. దాదాపు సంసత్సరకాలంగా జరుగుతున్న ఈ కేసులో తమకు ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదని ముంబయి పోలీసులు వెల్లడించారు. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నప్పుడు పటేకర్ తన చెయ్యి పట్టుకుని లాగి అసభ్యకరంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించారు.
తనుశ్రీ వ్యాఖ్యలతో చిత్ర పరిశ్రమలో ‘మీటూ’ ఉద్యమానికి తెర తీసింది. ఏడు నెలల క్రితం తనుశ్రీ.. పటేకర్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దాంతో ముంబయిలోని ఓషివారా పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నవారిలో దాదాపు 15 మందిని పోలీసులు విచారించారు. అయితే పదేళ్ల క్రితం జరిగిపోయిన విషయం కావడంతో ఎవ్వరికీ ఏమీ గుర్తులేదని చెప్పారట. షూటింగ్ ఆగిపోయిన విషయం గుర్తుంది కానీ, ఎందుకు ఆగిపోయిందో తెలీదని అన్నారట. ఇప్పటివరకు సాక్ష్యాలేవీ దొరక్కపోవడంతో విచారణ కొనసాగించడం కష్టమవుతోందని పేర్కొన్నారు.
దీనిపై తనుశ్రీ స్పందిస్తూ.. ‘పోలీసులు విచారించిన 15 మంది ఎవరు? వారు నాకు తెలిసిన వారా? లేక పటేకర్‌కు తెలిసినవారా? వారంతా కచ్చితంగా పటేకర్ స్నేహితులు. అలాంటప్పుడు నాకు ఎందుకు సహకరిస్తారు? అయినా నేను వేధింపులు ఎదుర్కొన్నానని నిరూపించుకోవడానికి నాకు ఎలాంటి సాక్ష్యాలు అవసరం లేదు. ఇలాంటి విషయాల్లో ఒక్కోసారి న్యాయం జరగడానికి నిజాలు బయటపడటానికి ఆలస్యం అవుతుంది. మరోపక్క పోలీసుల విచారణ కూడా ఆలస్యం అవుతోంది.
వారు విచారణ చేపట్టిన వారంతా ఒకప్పుడు నేను వేధింపులు ఎదుర్కొంటుంటే మౌనంగా చూస్తూ కూర్చున్నవారే. ఇలాంటివారు క్రిమినల్స్‌ను కాపాడటానికి అబద్ధాలు ఆడుతుంటారు. నాకు న్యాయం జరిగేలా చేయడానికి కొందరు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కానీ, వారికి బెదిరింపులు వస్తున్నాయి. నిందితుడికి ఎప్పటికైనా శిక్ష పడుతుందన్న నమ్మకం నాకుంది. ఈ పోరాటం కేవలం నా ఒక్కదానిదే కాదు. మౌనంగా బాధను భరిస్తున్న ఆడవారందరిదీ’ అని పేర్కొన్నారు తనుశ్రీ.