బాలీవుడ్ నటుడు సోనుసూద్ ఇప్పుడు వలస కార్మికుల పట్ల దేవుడైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో కష్ట కాలంలో ప్రభుత్వాలే చేయలేని పనిని తన నెత్తిన వేసుకుని చేసాడు. వలస బాధితుల్ని స్వరాష్ర్టాలకు తరలించడంలో ఆయన చేసిన సేవలు నిజంగా ఎంతో గొప్పవి. రాజకీయంగా కొన్ని విమర్శలు ఎదుర్కున్నప్పటికీ అంతిమంగా సోనుసూద్ సేవల ముందు నిలబడలేక పోయాయి. తాజాగా నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా సోనుసూద్ రీల్ విలన్ కాదు..రియల్ హీరో అంటూ మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగు అభిమానులు సోనుసూద్ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి రియల్ హీరోగా ప్రమోట్ చేస్తున్నారు.
మీరు చేయాల్సింది విలన్ పాత్రలు కాదు. హీరోల పాత్రలంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు. తెలుగు వాళ్లు అభిమానం చూపిస్తే ఎలా ఉంటుందో? సోనుసూద్ కి గట్టిగానే తెలియజేస్తున్నారు. ఈ ఉత్సాహాంలోనే సోనుసూద్ దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఉద్యోగాల కల్పన కోసం ‘ప్రవాసీరోజ్ గార్.కామ్’ అనే వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసినట్లు సోనూ ట్విట్టర్ లో తెలిపారు. ఇది నిజంగా షాకింగే. సోనుసూద్ నుంచి ఇలాంటి ప్రకటన కూడా వస్తుందా? అని ఎవ్వరూ అసలు ఊహించి ఉండరు. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న యువత ఈ ఉద్యోగాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ, తదితర సౌకర్యాలు ఉంటాయని తెలిపారు.
అమెజాన్, సోడెక్సో, అర్బన్ కో, పోర్టీ, క్వెస్ కార్ప్, ఏఈపీసీ, సీఐటీఐ, ట్రైడెంట్ వంటి సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఇవన్నీ చూస్తుంటే సోనుసూద్ కూడా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లా పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోనుసూద్ రాజకీయంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారా? అన్న ప్రచారం మరోసారి తెరపైకి వస్తోంది. ఆ మాట అటుంచితే జగన్ మోహన్ రెడ్డి గ్రామ వార్డు-వాలంటీర్ వ్యవస్థ ద్వారా లక్షల ఉద్యోగాలు కల్పించిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ సీఎం ఇలాంటి ప్రతిపాదన ఏ రాష్ర్టంలోనూ తీసుకురాలేదు. ఇలాంటి భర్తీలు కేవలం కేంద్ర ఫరిదిలో ఉన్న కొన్ని శాఖల్లోనే జరుగుతుంటాయి. ఆపై ప్రయివేటు పరంగాను జరుగుతాయి. ప్రస్తుతం సోనుసూద్ ఇప్పుడు అలాంటి సంకల్పానికి పూనుకోవడం విశేషం.