బ్లాక్ బస్టర్స్ డైరక్టర్ పై లైంగిక ఆరోపణలు, ఇండస్ట్రీ షాక్

మీటూ ఉద్యమం ఆ మధ్యన సినీ పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ‘మీటూ’ సంఘటనలు, ఆరోపణలు కొంతమేరకు తగ్గుముఖం పట్టాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా రాజ్‌కుమార్‌ హిరాణీ లాంటి పేరున్న దర్శకుడిపై ఓ మహిళా దర్శకురాలు మీటూ ఆరోపణలు చేసి మీటూ ఉద్యమం మళ్లీ రాజేసింది.

వివరాల్లోకి వెళితే.. ‘సంజు’ సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన ఓ మహిళ.. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న సమయంలో హిరాణీ తనను లైంగికంగా వేధించారని ఆరోపణ లు చేసారు.సంజు సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన ఆమెపై సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో 2018 మార్చి-సెప్టెంబర్‌ మధ్యకాలంలో హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని, తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించారు. ఈ మేరకు ఈ ఘటన గురించి సంజు సినిమా నిర్మాత విధూవినోద్‌ చోప్రాకు, అతని సోదరి, భార్యకు మెయిల్‌ పంపినట్లు హఫ్‌ పోస్ట్‌ ఇండియా పత్రిక పేర్కొంది.

ఆమె రాసిన మెయిల్‌లో.. ‘సర్‌.. నా పట్ల జరిగినది చాలా పెద్ద తప్పు. హిరాణీ పేరున్న దర్శకుడు. నేను కేవలం ఆయన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్‌ను. నా పట్ల జరిగిన దారుణాన్ని చెప్పుకోలేను. ఆరోజు నా మనసు, శరీరం పాడైపోయాయి. అలా ఆరు నెలల పాటు హిరాణీ సర్‌ నన్ను లైంగికంగా వేధించారు. కానీ నాకు వేరే అవకాశం లేదు. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేక మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలేసినా మరో ఉద్యోగం దొరకదేమోనన్న భయం, ఆయన నా పనితనం గురించి బయట తప్పుగా మాట్లాడతారేమోనన్న భయం నన్ను మౌనం వహించేలా చేసింది.’ అని పేర్కొంది.

అయితే తనపై వస్తున్న ఆరోపణలను హిరాణీ ఖండించారు. హిరాణీ తరఫు న్యాయవాది ఆనంద్‌ దేశాయ్‌ మీడియా ద్వారా మాట్లాడుతూ..‘నా క్లయింట్‌ హిరాణీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఆయన పేరు చెడగొట్టడానికి ఎవరో ఇలా చెప్పి చేయిస్తున్నారనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.