సినిమా బ్యాన్ చెయ్యండి..అర్చకుల డిమాండ్,వివాదం కారణం

సినిమాలో వివాదాస్పద అంశాలు ఉన్నప్పుడు వాటిని తొలిగించండి లేదా బ్యాన్ చేయండి అంటూ డిమాండ్స్ వస్తూండటం జరుగుతూంటుంది. అయితే అదే సమయంలో మా సినిమా రిలీజ్ కాకుండానే..అందులో ఏముందో తెలియకుండానే .. మీరు ఫలానా విషయం ఉందని ఊహించుకుని, బ్యాన్ చేయమంటే ఎలా అంటూ సమాధానం ఇస్తూంటారు. అయితే ఇవి కొందరు చిత్రం పబ్లిసిటీకు కూడా ఉపయోగపడతాయని భావిస్తూంటారు. ఇప్పుడు అలాంటి వివాదమే ఓ హిందీ చిత్రానికి ప్రారంభమైంది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, సారా అలీ ఖాన్‌ జంటగా నటించిన చిత్రం ‘కేదార్‌నాథ్‌’. అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం టీజర్ ఈ మధ్యనే రిలీజైంది. అయితే ..ఈ సినిమాను నిషేధించాలంటూ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయ అర్చకులు ఆందోళనలు చేస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలో సీన్స్ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2013లో కేదార్‌నాథ్‌లో వచ్చిన వరదల నేపథ్యంలో ఓ యువతి, యువకుడి మధ్య పుట్టిన ప్రేమ కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. దాంతో ఈ దేవాలయ అర్చకులు సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

‘సినిమాను నిషేధించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. సినిమా టీజర్‌ చూసినవారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా లవ్‌ జిహాద్‌ని ప్రేరేపించేలా ఉందని, తమ మనోభావాలు దెబ్బతినేలా టీజర్‌ ఉందని అంటున్నారు. పోస్టర్‌లో ముస్లిం యువకుడు, హిందూ యువతిని మోసుకెళుతున్నట్లు చూపించారు. అసలు కేదార్‌నాథ్‌కు ముస్లింలే రారు.

అదీకాకుండా సినిమా టీజర్‌లో..వరదల్లో వేలాది మంది కొట్టుకుపోతూ చనిపోతుంటే ఆ దృశ్యాల మధ్య ముద్దు సన్నివేశాలను చూపించారు. కాబట్టి ‘కేదార్‌నాథ్‌’ సినిమాను బ్యాన్‌ చేయండి.’ అని ఆలయ అర్చకులకు చెందిన కేదార్‌ సభ ఛైర్మన్‌ వినోద్‌ శుక్ల మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఈ విషయమై చిత్ర దర్శక,నిర్మాతలు స్పందించాల్సి ఉంది. ‘కేదార్‌నాథ్‌’ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.