మీటూ ఉద్యమం ఊపందుకున్న వేళ..సత్యాలు,అసత్యాలు కూడా మిళితమైపోతున్నాయి. కొందరు కావాలని తమ స్వలాభం కోసం పబ్లిసిటీ వస్తుందనో లేక సదరు వ్యక్తులపై కోపంతో కూడా మీటూ అంటూ ఇరికించే పోగ్రామ్ పెట్టుకుంటున్నారు. అయితే కొందరు అదృష్టవశాత్తు వాటినుంచి తప్పించుకోగలుగుతున్నారు.
రీసెంట్ గా అదే కోవలం ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ నటి, మోడల్ కేట్ శర్మ చేసిన ఆరోపణలు తప్పని పోలీసులు తేల్చేశారు. తనను ఇంటికి పిలిచిన సుభాష్ ఘయ్ అక్కడ చాలామంది ఉండగానే మసాజ్ చేయమని అడిగారని పేర్కొంది. తాను కాదనలేక రెండు మూడు నిమిషాలు చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు బాత్రూంలోకి వెళ్తే ఆయన తన వెనకాలే వచ్చారంటూ ఆరోపణలు చేసింది.
అక్కడ తనను పట్టుకుని తనతో ఒకరాత్రి గడిపితే సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని చెబుతూ తనను రేప్ చేయటానికి ప్రయత్నించాడని ఆరోపించింది. అంతేకాదు, సినిమా డిస్కషన్ పేరుతో తనను బెడ్రూములోకి తీసుకెళ్లాడని, మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా తనను దగ్గరకు తీసుకుని లిప్ కిస్ పెట్టబోయాడని ఆరోపిస్తూ ముంబైలోని వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేట్ శర్మ ఆరోపణలపై విచారణ ప్రారంభించారు. నటి ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, సుభాష్ ఘయ్‌పై ఆమె చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చారు.
అంతేకాదు, ఆరోపణల్లో పసలేదని తేలిపోవడంతో తన తల్లి ఆరోగ్యం బాగాలేదన్న సాకుతో దర్శకుడిపై పెట్టిన కేసును ఆమె వెనక్కి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తాజాగా, సుభాష్ ఘయ్ స్పందిస్తూ తనపై లేనిపోని ఆరోపణలు చేసి తన ప్రతిష్ఠను బజారుకు ఈడ్చేందుకు ప్రయత్నించిన కేట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.