ఇన్నాళ్లూ మణికర్ణిక విషయంలో మౌనంగా ఉన్న క్రిష్ నోరు విప్పి సంచలన వ్యాఖ్యలు చేసారు. బాలీవుడ్‌లో ‘మణికర్ణిక’ వివాద విషయం తెలుగు మీడియాతో వివరించారు. దర్శకుడిగా ఆయన పేరు పక్కన కంగనా రనౌత్ తన పేరు చేర్చటానికి గల కారణం, ఇద్దరికీ మధ్య జరిగిన వివాదం వివరించారు.
క్రిష్ మాట్లాడుతూ…‘మణికర్ణిక’ కోసం 109 రోజులు షూట్ చేశాం. ఏప్రిల్ 27న విడుదల చేద్దామనుకున్నాం. తరవాత ఆగస్టు 15కి మారింది. ‘మణికర్ణిక’ రీ రికార్డింగ్‌లో ఉన్నప్పుడు ‘ఎన్టీఆర్’కి అవకాశం వచ్చింది. ‘మరో పదిహేను రోజుల్లో మిగిలిన ప్యాచ్ వర్క్ పూర్తి చేద్దాం’ అనుకుని ‘ఎన్టీఆర్’ కోసం వచ్చేశా. కానీ ఎప్పుడైతే సినిమా చేతులు మారిందో.. రకరకాల మార్పులు మొదలయ్యాయి.
సోనూసూద్‌ని హఠాత్తుగా తొలగించి, అప్పటి వరకూ ఆయనపై తెరకెక్కించిన సన్నివేశాలు మరో నటుడితో రీషూట్ చేశారు. కథని తప్పుదోవ పట్టించి చరిత్రని వక్రీకరించారు. ఈ విషయం గురించి ఏం మాట్లాడినా ‘మణికర్ణిక’ శోభ తగ్గుతుంది. అందుకే వివాదాలకు దూరంగా ఉండాలనుకుని మౌనంగా ఉన్నా.
సోనూసూద్‌ని తొలగిస్తున్న విషయం తెలుసు. గొడవంతా అక్కడే జరిగింది. అదే పెద్ద తప్పు. అలా జరిగి ఉండకూడదు. ఈ విషయంలో సోనూసూద్ తప్పేం లేదు. నటుడిగా ఆయన చేసింది వందశాతం కరెక్ట్ అని అన్నారు.
అలాగే ‘మణికర్ణిక’ నుంచి సోనూ సూద్ తప్పుకోవడం వల్ల మళ్లీ షూటింగ్ ఏర్పడింది. నా పాత్ర వరకూ నేను సరిగ్గానే నిర్వహించాను. నాకూ 10 సినిమాల వయసొచ్చింది. ఇంక దర్శకత్వ క్రెడిట్ కంగనాకి వెళుతుందా? నాకా? అని ఆలోచించను అని తేల్చి చెప్పారు.