బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈసారి తనదైన శైలిలో ముక్కు సూటి వ్యాఖ్యలతో పరిశ్రమ పెద్దల్ని కడిగేసారు. సుశాంత్ ది ఆత్మహత్యా? లేక పథకం ప్రకారం హత్య చేసారా? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. సుశాంత్ మరణం అందర్నీ విషాధంలో ముంచింది. కానీ ప్రతీ విషయాన్ని రెండవ కోణం నుంచి కూడా ఆలోచించాలి. అలాంటి విషయం సుశాంత్ జీవితంలో ఒకటుంది. ఎవరు మనసైతే బలహీనంగా మారిపోతుందో అప్పుడే డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. అలాంటి వాళ్లకే చనిపోవాలి అన్న ఫీలింగ్ కల్గుతుందన్నారు. స్టాన్ ఫర్డ్ స్కాలర్ షిప్ సాధించిన విద్యార్థి, అతడి మనసు ఎలా బలహీనపడుతుంది! అని సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నించింది.
తను పెట్టిన ఆఖరి పోస్టులు చూసారా? నా సినిమాలు చూడండి అంటూ ఎంతగా అభ్యర్ధించాడో వాటిని చూస్తేనే అర్ధమవుతుంద న్నారు. నాకు గాడ్ ఫాదర్ లేడు. నా సినిమాలు ఆడకుంటే ఇండస్ర్టీ నుంచి పంపించేస్తారు అంటూ బ్రతిమలాడాడు. ఎందుకు పరిశ్రమ తనలో ఒకడిగా గుర్తించలేదని బాధపడ్డాడు. అంతా ముగిసినట్లు అనిపిస్తుందని ఓ ఇంటర్వూలో సుషాంత్ ఆవేదన చెందాడన్నారు. ఇప్పుడు చెప్పండి ఘటనలో మన ప్రమేయం లేదంటారా? అంటూ పరిశ్రమ పెద్దల్ని ప్రశ్నించింది కంగన. సుషాంత్ నటించిన `కాపో చే`, `ధోనీ`, `కేదార్ నాథ్` ,` చిచోర్` లాంటి సినిమాలు బాగున్నా అతనికి గుర్తింపు ఎక్కడా? గల్లిబాయ్ లాంటి సినిమాలకు అవార్డులిస్తారు.
చిచోర్ లాంటి చిత్రాలను పట్టించుకోరు. ఇదంతా నెపోటిజం అంటూ మండిపడ్డారు. ప్రస్తుతం కంగన వ్యాఖ్యల్ని అందర్నీ మరోసారి ఆలోచనలో పడేసాయి. అయితే కంగన బాలీవుడ్ పై ఉన్న కొన్ని వ్యక్తిగత కక్షల కారణంగా సుషాంత్ ఆత్మహత్యను తనకు అనుకూలంగా మార్చుకుంటుంది! అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కంగన బాలీవుడ్ పెద్దలంటే ఎప్పకప్పుడు కారాలు..మిరియాలు నూరుతుంటుంది. అవకాశం వచ్చినప్పుడల్లా తనదైన శైలిలో విమర్శలు గుప్పించి సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంటుంది. ఇది అలాంటి ఓ ప్రయత్నమే! అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.