కంగన చేసిన దారుణాలు బయిటపెట్టిన క్రిష్

క్రిష్ దర్శకత్వంలో కంగన రనత్ నటించిన చిత్రం ‘మణికర్ణిక’. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ అందుకుంది. కొన్ని కారణాల వల్ల సినిమాకు సంబంధించిన కొంత భాగానికి కంగన దర్శకత్వం వహించారు. అయితే వాళ్లిద్దరి మధ్యా చాలా వివాదం అయ్యిందని, అందుకే క్రిష్ తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. ఈ విషయంలో ఎంతవరకూ నిజం ఉందనే విషయమై క్రిష్ స్పందించారు.

ఇంతకాలం ఎక్కడా నోరు జారకుండా క్రిష్ చాలా సైలెంట్ గా ఉండి, రిలీజ్ అయ్యాక ఆయన మాట్లాడారు. దర్శకుడిగా ఆయన పేరు పక్కన కంగనా రనౌత్‌ తన పేరు చేర్చటానికి గల కారణం, ఇద్దరికీ మధ్య జరిగిన వివాదం వివరించారు. హీరోయిన్‌ కంగనా రనౌత్‌ కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు. తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించిందని చెప్పారు. ఆమె ప్రవర్తన ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అన్నారు.

క్రిష్ మాట్లాడుతూ…మణికర్ణిక చిత్రం లాస్ట్ ఇయిర్ జూన్‌కే సినిమా మొత్తం ఎడిటింగ్‌ పూర్తి చేసినట్లు చెప్పారు. అందరూ నటులు డబ్బింగ్‌ పూర్తి చేసుకున్నారని అన్నారు. కేవలం కంగన మాత్రం డబ్బింగ్‌ చెప్పాల్సి ఉందని, అప్పుడు ఆమె ‘మెంటల్‌ హై క్యా’ సినిమా షూట్‌ కోసం లండన్‌లో ఉన్నారని తెలిపారు. ‘కంగన లండన్‌ నుంచి తిరిగి వచ్చారు. సినిమా చూసి తనకు నచ్చిందని చెప్పారు. కానీ కొన్ని చిన్న మార్పులు చేస్తే బాగుంటుందని అన్నారు. తర్వాత ఇది మార్చండి, అది మార్చండి అంటూ వచ్చారు. చివరకు రీషూట్స్ పెట్టారన్నారు.

క్రిష్ కంటిన్యూ చేస్తూ…‘మణికర్ణికలో నేను తెరకెక్కించిన సన్నివేశాలు నిర్మాతకు నచ్చలేదని, భోజ్‌పురి సినిమా ఉందని కంగనా నాకు ఫోన్‌ చేసి చెప్పింది. నేనేమీ మాట్లడకుండా నవ్వాను. నా సినిమాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు ఇంతకుముందే తెలుసు. నేను ఎంత చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. నాతో ఫోన్‌లో చాలా దురుసుగా మాట్లాడింద’ని క్రిష్‌ తెలిపారు.

దాదాపు సినిమా అంతా తానే తెరకెక్కించానని చెప్పారు. దర్శకత్వంలో తన కంటే కంగనా పేరు ప్రముఖంగా వేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒకరు చేసిన పనిని తనదిగా చెప్పుకుంటున్న ఆమెకు అసలు నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తాను తీసిన సన్నివేశాలనే మళ్లీ చిత్రీకరించి ఆమె పేరు వేసుకుందని తెలిపారు.

‘ఫస్టాఫ్‌లో 20-25 శాతం, సెకండాఫ్‌లో 10-15 శాతం వరకు కంగనా తెరకెక్కించారు. ఆమె ఎంట్రీ సీన్‌, పాట నేను చిత్రీకరించలేదు. సెకండాఫ్‌లో నేను తీసిన చాలా సన్నివేశాలను మళ్లీ రీషూట్‌ చేశారు. అతుల్‌ కులకర్ణి, ప్రజాక్తమాలి పాత్రలను కూడా కుదిరించారు. సోనూ సూద్‌ పాత్రను మార్చమనడంతో కంగనాతో అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఇంటర్వెల్‌కు ముందు సోనూ పాత్ర చనిపోవాలని ఆమె పట్టుబట్టింది.

దానికి నేను ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం జరిగింది. సహ-నిర్మాత కమల్‌ జైన్‌ కూడా ఆమె వైపు నిలిచాడు. తర్వాత నేను నిర్మాణ సంస్థ జీ-స్టూడియోస్‌తో మాట్లాడటం మానేశాను. ఒకసారి కంగనా నాకు ఫోన్‌ చేసింది. తనను డైరెక్షన్‌ చేయమని నిర్మాతలు కోరుతున్నారని చెప్పింది. తర్వాత కమల్‌ జైన్‌ ఫోన్‌ చేసి ముంబైకి రమ్మన్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ కంగనా ఉంది. సినిమాలో చిన్నచిన్న మార్పులు చేయాలని, అవన్నీ తాను చూసుకుంటానని చెప్పడంతో నేను హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశాను.

ఇక్కడికి వచ్చిన తర్వాత సోనూ సూద్‌ నాకు ఫోన్‌ చేశాడు. ఇంటర్నెల్‌లోనే నీ పాత్ర ముగించమన్నారు. అలాయితే నేను తప్పుకుంటానని నిర్మాతతో చెప్పాను. కంగనా డైరెక్షన్‌ చేస్తుందని కమల్‌ జైన్‌ నుంచి సమాధానం వచ్చిందని సోనూతో చెప్పాను. నేను కొనసాగకపోతే తాను కూడా తప్పుకుంటానని నాతో చెప్పాడు. కంగనా దర్శకత్వంలో నటించడానికి ఇష్టంలేక అతడు సినిమా నుంచి బయటకెళ్లిపోయాడని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదు. 100 నిమిషాలు ఉండాల్సిన అతడి పాత్రను 60 నిమిషాలకు కుదించారు.

అతడి పాత్రను మార్చకుండా ఉండివుంటే అనుకున్న బడ్జెట్‌లో సినిమా పూర్తయ్యేది. సినిమాలో నా పేరు ఎక్కడో మూలన పడేశారు. నాకు ఇవ్వాల్సిన పారితోషికంలో 30 మాత్రమే ఇచ్చారు. ఏదోక రోజు మిగతా బాలెన్స్‌ వస్తుంద’ని క్రిష్‌ వివరించారు.

అయితే 30 శాతం మాత్రమే క్రిష్‌ తీశారని, మిగతా సినిమా అంతానే తెరకెక్కించానని ‘ముంబై మిర్రర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌ చెప్పుకోవడం విశేషం. మునిగిపోతున్న నావను కాపాడటానికి తాను ప్రయత్నించానని ఆమె చేసిన వ్యాఖ్యలపై క్రిష్‌ స్పందిస్తూ.. ‘ఓరి దేవుడా’ అంటూ తలపట్టుకున్నారు.