కంగనా మ్యాటర్ : క్రిష్ కు రాఘవేంద్రరావు కొడుకు కౌంటర్?

ఆ మధ్యన క్రిష్ కు, బాలీవుడ్ నటి కంగనా రనత్ మధ్య పెద్ద యుద్దమే జరిగింది. ఆమె నటిగా కాకుండా అన్ని విషయాల్లోనూ కలగచేసుకుంటుందని, తన పాత్ర కోసం మిగతా పాత్రలను తెగ్గొట్టేస్తుందని ఆరోపించారు. అయితే అందులో తప్పేమి లేదని సపోర్ట్ చేస్తున్నారు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌ కోవెలమూడి . అలాగని క్రిష్ మాటలను డైరక్ట్ గా ఆయనేమీ తప్పు పట్టలేదు. అసలేం జరిగిందంటే..

ప్రస్తుతం ప్రకాశ్‌ దర్శకత్వంలో కంగన నటిస్తున్న చిత్రం ‘మెంటల్‌ హై క్యా’. దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను చూసిన కంగన అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదే విషయాన్ని ఆమె ప్రకాశ్‌కు వివరించి సినిమాకు తాను కూడా దర్శకత్వం వహిస్తానని అన్నారు. ఇందుకు తాను కూడా ఒప్పుకొన్నట్లు ప్రకాశ్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

‘నేను తెరకెక్కించిన కొన్ని సీన్స్ ను కంగన చూసారు. ఆమె సంతృప్తి చెందలేదు. సినిమాలో హీరోగా నటిస్తున్న రాజ్‌కుమార్‌ రావు ఎక్కువ సీన్స్ లో హైలైట్‌ అవుతున్నారని బాధపడ్డారు. ఆ సీన్స్ అన్ని మళ్లీ తెరకెక్కించాలన్నారు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆమె సెట్స్‌లో ఉంటే కేవలం నటిగానే కాకుండా మిగతా విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటారు.

సినిమా బాగా రావాలన్న ఉద్దేశంతో ఆమె అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటారు. అందులో ఎంతమాత్రం తప్పు లేదు. ఆమిర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లు కూడా తమ డైరెక్టర్లకు సూచనలు ఇస్తూ ఉంటారు. అలాంటప్పుడు కంగన ఓ డైరెక్టర్‌ని డైరెక్ట్‌ చేయడంలో తప్పేముంది? ఎందుకు కేవలం కంగన విషయంలో అందరూ అంత షాకవుతున్నారు?’ అంటూ ఆమెను వెనకేసుకొచ్చారు ప్రకాశ్‌.