‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్ టాక్ ఏంటి?

హీరో విజయ్‌ దేవరకొండ కెరీర్ లో ‘అర్జున్‌ రెడ్డి’ఓ సంచలనం . ఈసినిమా ఎన్నో వివాదాల మధ్య విడుదలై భారీ వసూళ్లు సాధించింది. అంతేకాదు ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఈ సినిమాతో తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు ఈ యంగ్‌హీరో. అదే స్దాయిలో అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కూడా ఫుల్‌ ఫేమస్‌ అయ్యాడు. తెలుగులో సెన్సేషన్‌ సృష్టించిన ఈ చిత్రాన్ని.. మిగతా భాషల్లో కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా బాలీవుడ్‌లో అర్జున్‌ రెడ్డి రీమేక్‌పై భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ ఈ శుక్రవారం రిలీజైంది. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం దాదాపు అర్జున్‌ రెడ్డి కు నకలు లాగే ఉందనే టాక్ వచ్చింది. షాహిద్ లుక్స్‌తో పాటు సీన్స్‌, డైలాగ్స్‌ అన్ని అర్జున్‌ రెడ్డినే మక్కీకి మక్కి దించేసినట్టుగా అనిపించినా అక్కడక్కడా కొన్ని మార్పులు చేశారు. హీరో తల్లి పాత్రను మార్చారు. ఆమెను సినిమాలోనూ ఓ నటిగా చూపించారు.

హిందీ ప్రేక్షకుల్లో దాదాపు తొంభై శాతం మంది ‘అర్జున్‌రెడ్డి’ సినిమాను చూసి ఉండరు కాబట్టి.. ‘కబీర్‌ సింగ్’కు వారు ఫిదా అవుతారని నమ్ముతున్నారు. షాహిద్‌ తన నటనతో బాలీవుడ్‌ విజయ్‌ దేవరకొండ అని నిరూపించుకున్నారనే టాక్ వచ్చింది. అయితే కొందరు రివ్యూ రైటర్స్ మాత్రం ఈ సినిమాని బి గ్రేడ్ స్టఫ్ అని కొట్టిపారేసారు. తెలుగు పరిశ్రమలో సంచలనం సృష్టించిన అర్జున్‌ రెడ్డి, బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.