షాక్ :బ‌యోపిక్‌ పేరుతో రాహుల్ గాంధీపై కుట్ర‌!!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఇటీవల విడుదలైన ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘మై నేమ్ ఈజ్ రాగా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ పడింది. ఈ ట్రైల‌ర్ మొదటి నుంచి చివరిదాకా నాశిర‌కం విజువ‌ల్స్ తో చుట్టేశార‌ని, ఓ ప్యారిడీలా ఉందని తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

కావాలని కాంగ్రెస్ అధినాయ‌కుడి ఇమేజ్ కి డ్యామేజ్ క‌లిగించేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నం ఇది అంటూ ప‌లువురు సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ తీవ్ర విమ‌ర్శ‌ల్ని గుప్పిస్తున్నారు. వారు అనేదాన్ని బట్టి ఇది రాహుల్ గాంధీ ఇమేజిని దెబ్బ కొట్టడానికి చేస్తున్న కుట్ర . ఈ కుట్ర చేస్తున్న‌ది మరెవరో కాదు భాజ‌పానే.. భాజ‌పా నాయ‌కులే ఈ బ‌యోపిక్ వెన‌క ఉండి క‌థ న‌డిపిస్తున్నారు అంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

MY NAME IS RAGA First Look Teaser

అయితే ద‌ర్శ‌కుడు రూపేష్ వెర్ష‌న్ ఏమంటారంటే…తాను ఒక జ‌ర్న‌లిస్టుగా నేను రాహుల్ గాంధీని చాలా ద‌గ్గ‌ర‌గా చూశాను. దిల్లీలో ప‌ని చేస్తున్న‌ప్పుడు ఆయ‌న‌ను చూసి స్ఫూర్తి పొందాను. రాహుల్ చుట్టూ ఉన్న నెగెటివిటీ, కాన్‌స్పిర‌సీని స్వ‌యంగా చూశాను. అత‌డిని ఎవ‌రూ న‌మ్మ‌లేదు. ఆయ‌న ఇలా కంబ్యాక్ అవుతాడ‌ని ఎవ‌రూ భావించ‌లేదు. రాహుల్ ని మొన్న‌టి వ‌ర‌కూ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ అదే స‌న్నివేశం. కానీ ఆయ‌న ఎన్నిక‌ల్లో గెలిచాక మాత్రం జ‌నం చుట్టూ మూగారు“ అని అన్నారు.

అంతేకాకుండా ఈ సినిమాని ఓ పొలిటిక‌ల్ ఎజెండాతో పొలిటిక‌ల్ ప్రొప‌గండాతో తీయ‌డం లేద‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. ఈ సినిమాకి పెట్టుబ‌డులు పెట్టింది ఎవ‌రు? అని మీడియా వారు ప్ర‌శ్నిస్తే.. కాంగ్రెస్ త‌ప్ప ఇత‌ర పార్టీల నాయ‌కులు ఈ సినిమాకి ఎందుకు పెట్టుబ‌డులు స‌మ‌కూర్చుతార‌ని అన్నారు.

అయితే కావాలనే రాహుల్ గాంధీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారంటూ అంతటా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా దర్శకుడు గతంలో `కామ‌సూత్ర 3డి` తీయటంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇందులో య‌థార్థాల్ని చూపిస్తున్నారా? లేక యువ‌రాజాని నెగెటివ్ గా చూపిస్తున్నారా? అన్న‌ది కాస్త వేచి చూడాల్సిందే.

‘‘ఈ సినిమాను నేను బయోపిక్‌గా భావించడం లేదు. ఓటమి, వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తికి సంబంధించిన కథ ఇది. దీనిని నేను బయోపిక్‌ అనను. జీవితంలో తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొన్న వ్యక్తి విజయం సాధించిన తర్వాత అతడిని ఆపడం సాధ్యం కాదు.. ఇదే సినిమా కథ’’ అని దర్శకుడు వివరించాడు.