సుషాంత్ ఆత్మ‌హ‌త్య‌పై స‌ల్మాన్, క‌ర‌ణ్ ల‌పై కేసు!

బాలీవుడ్ న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య పై కుటుంబ స‌భ్యులు సుషాంత్ ది ఆత్మ‌హ‌త్య కాదు..హ‌త్యా అంటూ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసును సీబీఐతో ద‌ర్యాప్తు చేయించాల‌ని కోరారు. కంగ‌నా ర‌నౌత్, ప‌ర్హాన్ ఆక్త‌ర్, ప్ర‌కాశ్ రాజ్ స‌హా ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు కొంద‌రి బాలీవుడ్ పెద్దల తీరును త‌ప్పు బ‌ట్టారు. సుషాంత్ ఆత్మ‌హ‌త్య‌కు వాళ్లు కార‌కులే నంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. సుషాంత్ మాన‌సికంగా ఒత్తిడికి గుర‌వ్వ‌డానికి వివ‌క్ష చూపించ‌డ‌మే కార‌ణ‌మంటూ మండిప‌డ్డారు. తాజాగా బీహార్ లోని ముజ‌ఫ‌ర్ కోర్టులో సుషాంత్ బాలీవుడ్ మాఫియాకు బ‌ల‌య్యాడంటూ 8 మంది సెల‌బ్రిటీల‌పై సుధీర్ కుమార్ అనే లాయ‌ర్ పిటీష‌న్ దాఖ‌లు చేసారు.

క‌ర‌ణ్ జోహార్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ, స‌ల్మాన్ ఖాన్, నిర్మాత ఏక్తాక‌పూర్ ల‌ను కేసులో నిందుతులుగా చేర్చారు. వీళ్లు పెట్టిన ఇబ్బందుల కార‌ణంగానే సుషాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని పిటీష‌న్ లో పేర్కొన్నారు. త‌మ‌కు పోటీగా వ‌స్తున్నాడ‌నే, ఎలాగైనా సుషాంత్ ఎదుగుద‌ల‌ను అడ్డుకోవాల‌నే మానసిక ఒత్తిడికి గుర‌య్యేలా చేసిన‌ట్లు పిటీష‌న్ లో ఉంది. ఇదే విష‌యంపై కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు సంజ‌య్ నిరుప‌మ్ కూడా స్పందించారు. సుషాంత్ 7 సినిమాల‌ను న‌ష్ట‌పోయాడ‌న్నారు. అది ఆరు నెల‌ల్లోనే ఇది జ‌రిగింద‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితిలో ఒత్తిడికి గురై సుషాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆరోపించారు.

ఇంకా ప‌లువురు సెల‌బ్రిటీలు, ఉత్త‌రాది అభిమానులు బాలీవుడ్లో నెపిటోయిజం కార‌ణంగా బ‌లైన మ‌రో హీరో అంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుషాంత్ కొత్త సినిమా ఒక‌టి ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తుంటే ఆ చిత్రాన్ని నేరుగా థియేట‌ర్లోనే విడుద‌ల చేయాలంటూ అభిమ‌నులు, నెటి జ‌నులు ప‌ట్టుబ‌డుతున్నారు. సుషాంత్ మ‌న మ‌ధ్య‌న లేడ‌ని ఎవ‌రికీ తెలియ‌కుండా ఓటీటీలో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ సినిమా వెనుక కూడా కొంత మంది పెద్ద‌లు కుట్ర చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వెల్లు వెత్తుతున్నాయి.