ప్రముఖ నటుడిపై రేప్‌ కేసు..పూర్తిగా ఇరుక్కున్నట్లే

బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్ చిక్కుల నుంచి బయిటపడేటట్లు లేదు. రచయిత్రి వింతా నందా ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు అతనిపై రేప్ కేసు నమోదు చేశారు. ఓషివారా పోలీసులు ఎఫ్‌ఐఆర్ బుక్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి మనోజ్ శర్మ వెల్లడించారు. అలోక్‌నాథ్‌కు వ్యతిరేకంగా వింతా నందా మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలని అతని భార్య వేసిన పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు కొట్టేసింది.

తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశాడు అలోక్‌నాథ్. లిఖితపూర్వక క్షమాపణతోపాటు పరిహారం రూ.1 ఇవ్వాలని కూడా అప్పట్లో అలోక్ డిమాండ్ చేశాడు. వింతా నందాతోపాటు మరికొందరు కూడా అలోక్‌నాథ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

అయితే దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ కమిటీ ముందు హాజరు కాకపోవడంతో అతన్ని సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి బహిష్కరించారు. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ పంపిన నోటీసుపై కూడా అతడు స్పందించలేదు.