‘ఆర్ ఎక్స్ 100’ హిందీ రీమేక్ హీరో ఇతనే…ఎలా ఉన్నాడు?

ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన చిన్న చిత్రాల్లో భారీ వసూళ్లను సాధించిన సినిమా ‘ఆర్ ఎక్స్ 100’ . కొద్ది పాటి యాక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా ఘన విజయం సాధించింది. దాంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి ఈ సినిమాపై పడింది.

చాలా మంది దర్శక,నిర్మాతలు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం వెంటబడుతున్నారు. ఇప్పటికే తమిళంలో ఈ సినిమా ఆది పినిశెట్టి హీరోగా రీమేక్ అవుతోంది. కన్నడంలోనూ ఈ సినిమా త్వరలో ప్రారంభమవుతుందని సమాచారం.

ఇదే సమయంలో ఈ సినిమాను హిందీలోను రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సాజిద్ నడియాడ్ వాలా ఈ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోగా సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి పరిచయం కానున్నాడు. హిందీలోనూ ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందనీ .. ఆహాన్ శెట్టి కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని సునీల్ శెట్టి భావించి ఓకే చెప్పేసారు.

హీరోయిన్ ఇంకా ఎవరినీ ఫైనలైజ్ చేయలేదు. ఇద్దరు హీరోయిన్స్ ని ఇప్పటికే అనుకుని ..అంత కన్నా బెస్ట్ ఆప్షన్ కోసం వెతుకుతున్నారు. దొరికితే వాళ్లతో లేదా వీళ్లలో ఒకరితో ముందుకు వెళ్తారు. జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఉత్తర ప్రదేశ్ లోని ఓ టౌన్ లో ఈ కథ జరుగుతున్నట్లుగా సినిమా సాగుతుంది.

ఆహాన్‌కు ఇప్పుడు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. మరి ఈ వైల్డ్‌ లవ్‌ స్టోరీలో ఎలా నటిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఈ హిందీ ‘ఆర్‌ ఎక్స్‌ 100’ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్‌ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా స్క్రిప్ట్‌ లో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.

అలాగే హిందీ వెర్షన్ ని మిలన్ లూథ్రియా డైర్కట్ చేయనున్నారు. డర్టీ పిక్చర్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మిలన్. దాంతో ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. వీరందరి నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.