సెక్స్ రాకెట్ లో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ అరెస్ట్

సెక్స్ రాకెట్ దందాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతూ సామాన్యుల్ని నిశ్చేష్ఠుల్ని చేస్తున్నాయి. న‌గ‌రాల్లో ప‌బ్లిగ్గా ఈ వ్య‌వ‌హారం సాగిపోతుండ‌డం.. ఈ దందాలో ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌ట‌ప‌డుతుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇక సినీప‌రిశ్ర‌మ‌లో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డంతో ప‌రిశ్ర‌మ‌కు చెడ్డ పేరు వ‌స్తోంది. మీటూ వివాదాల నేప‌థ్యంలో ప‌రిశ్ర‌మ గౌర‌వాన్ని దించేసే వ్య‌వ‌హార‌మే ఇది.

తాజాగా సెక్స్‌ రాకెట్ నిర్వ‌హిస్తున్న‌ బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌ ఒకరిని అరెస్ట్‌ చేసినట్టు మహారాష్ట్ర పోలీసులు మీడియాకు వెల్ల‌డించారు. ముంబైలోని ఖ‌రీదైన‌ జుహు సబర్బన్ లోని జెడ్‌ లగ్జరీ రెసిడెన్సీ హోటల్ పై సోషల్‌ సర్వీస్‌(ఎస్‌.ఎస్‌) అధికారులు దాడి చేసి బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌ రాజేశ్‌ కుమార్‌ లాల్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. ఈ రాకెట్‌ నుంచి ఉజ్బెకిస్తాన్ కు చెందిన ముగ్గురు మహిళలను కాపాడామ‌ని తెలిపారు.

ఈ దందా ఎలా జ‌రుగుతోంది? అంటే.. మేనేజ‌ర్ రాజేష్ లాల్‌ సహకారంతో ఉజ్బెకిస్తాన్ కు చెందిన జరీనా అనే మహిళ రంగంలోకి దిగి రాకెట్ ని నిర్వ‌హిస్తోందని పోలీసులు చెబుతున్నారు. విదేశాల నుంచి అమ్మాయిల్ని ముంబైలోని ఖ‌రీదైన హోట‌ళ్ల‌కు ర‌ప్పించి య‌థేచ్ఛ‌గా సెక్స్ రాకెట్ ని నిర్వ‌హిస్తున్నారు. ఒక్కో విటుడి నుంచి రూ.80వేలు అంత‌కుపైగా వ‌సూలు చేస్తున్నార‌ని తెలిపారు. మనుషుల అక్రమ రవాణా (హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ) నిరోధక చట్టం కింద స‌ద‌రు ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ పై కేసు నమోదు చేశారు. జరీనాను ప్రధాన నిందితురాలిగా పేర్కొని అరెస్ట్ చేశారు.