వైఎస్ జగన్ ఎన్నడూ లేని విధంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. జగన్ సీఎం అయ్యాక పీకేతో ఈ ఇంత ఎక్కువ సమయం మీటింగ్ పెట్టడం ఇదే మొదటిసారి కావడంతో వైసిపీ నాయకుల్లోనే అంతర్మథనం మొదలైంది. స్థానిక ఎన్నికలు అనివార్యమని ముందే తెలియడం, దేవాలయాల మీద దాడుల విషయంలో ప్రత్యర్థులకు టార్గెట్ కావడం వంటి విషయాల మీద వీరిద్దరి భేటీ జరిగిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ప్రాజెక్ట్ పార్టీ సిట్యుయేషన్ ఏంటి, ప్రజల్లో నాయకుల మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, ప్రాంతాల వారీగా బలాబలాల అంశాలు కూడ ప్రస్తావనకు వచ్చాయట. దీంతో ప్రశాంత్ కిశోర్ పార్టీ స్థితిగతుల మీద ఒక లుక్ వేసినట్టు చెబుతున్నారు.
ప్రశాంత్ కిశోర్ పరిశీలనలో షాకయ్యే నిజాలు బయటపడ్డాయట. అది కూడ మంత్రుల గురించి కావడం గమనార్హం. కేబినెట్ మంత్రుల్లో కొందరి మీద ఫీడ్ బ్యాక్ మరీ బలహీనంగా వచ్చిందట. 25 మంది మంత్రుల్లో డజను మంది మీద జనంలో ఎలాంటి అభిప్రాయం లేదని పీకే అంచనాకు వచ్చారట. వీరంతా పేరుకే మంత్రులు కానీ అస్సలు యాక్టివ్ స్థితిలో లేరట. పాలనలో ముఖ్యమంత్రి తర్వాత గుర్తుకొచ్చేది మంత్రులే. వీరి పనితీరును బట్టే ప్రభుత్వం మీద జనంలో ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పడుతుంది. మినిస్టర్లు చురుగ్గా ఉంటే పాలక పార్టీ ఇమేజ్ నిలబడుతుంది. అలా కాకుండా వారు నిద్రాణ స్థితిల్లో పార్టీ పేరు ప్రతిష్టలు కూడ పడకేస్తాయి. వైసీపీలో కొందరు మంత్రులు ఇలా నిద్రావస్థలోనే ఉన్నారని పీకే పరిశీలనలో తేలిందట.
కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, పెద్దిరెడ్డి, బుగ్గన లాంటి లీడర్లకు జనంలో మంచి ఫీడ్ బ్యాక్ ఉందని, వారి స్థాయిలో మిగిలిన మంత్రులు లేరట. మేకపాటి గౌతమ్ రెడ్డి, వెల్లంపల్లి, కన్నబాబుల పనితీరు కూడ పర్వాలేదు కానీ మిగిలిన మంత్రులే ఎటూ కాకుండా ఉన్నారట. జగన్ కేబినెతో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఉన్నారు. వీరు పేరుకే డిప్యూటీ సీఎంలు కానీ వారి పేరు మాత్రం జనంలో అస్సలు వినబడట్లేదట. కొందరి పేర్లు చెబితే ప్రజలు కనీసం గుర్తుపట్టడంలేదట. ఇందుకు అనేక కారణాలు చూపారట పీకే. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొందరు ఇంఛార్జులే అన్నీ చూసుకుంటున్నారు. ఏది జరగాలన్నా వీరి చేతుల మీదుగానే జరుగుతోంది. ఫలితంగా మంత్రులు కేవలం పదవులకే పరిమితం కావడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారట.
మొదట్లో వీరంతా కూడ హడావుడి చేయాలని ప్రయత్నించినా కోటరీ నాయకుల ప్రభావంతో మిన్నకుండిపోయారని, జనం లోకి వెళ్లి చేసేది కూడ ఏమీ లేకపోవడంతో కార్యాలయాలకే పరిమితమయ్యారట. ఇక పార్టీ పనుల విషయానికొస్తే అవన్నీ లోకల్ లీడర్ల చేతుల్లోనే ఉంటున్నాయట. అక్కడ కూడ వారి పాత్ర జీరో అని ఈ పద్దతిలో ఇమడలేక వారంతా మౌనంగానే ఉండిపోతు న్నారట. ఈ పద్దతిని సరిచేసి మంత్రులందరినీ క్రియాశీలకంగా మార్చకపోతే నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారట పీకే.