తెలుగుదేశం పార్టీకి కంచుకోటం అనదగిన జిల్లాల్లో గుంటూరు జిల్లా కూడ ఒకటి. కొమ్ములుతిరిగిన సీనియర్ నాయకులకు అడ్డా ఈ జిల్లా. కోడెల శివప్రసాద రావు, ధూళిపాళ్ళ నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు లాంటి సీనియర్ నాయకులు ఈ జిల్లా వాళ్ళే. కానీ గత ఎన్నికల్లో వీళ్లంతా ఓటమి పాలయ్యారు. టీడీపీ నిండా మునిగిపోయింది. ఓటమికి తోడు అధికార పార్టీ ఉక్కుపాదం మోపడంతో ఈ సీనియర్ నాయకులంతా సైలెంట్ అయిపోయారు. ఎవరి నియోజకవర్గాలకు వారు పరిమితమై జిల్లా రాజకీయాలను గాలికొదిలేశారు. కానీ ఒకే ఒక్క లీడర్ మాత్రం పార్టీని ముందుకు లాక్కొస్తున్నారు. ఆయనే డాక్టర్ చదలవాడ ఆనంద్ బాబు.
రాజకీయాలు మీద ఆసక్తితో తెలుగుదేశంలో చేరిన ఆయనకు చివరి క్షణం వరకు టికెట్ దొరకలేదు. చివరికి బీసీ కోటాలో నరసారావుపేట నుండి పోటీచేసే ఛాన్స్ దక్కింది. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. దశాబ్దాల రాజకీయ చరిత్రలో నరసారావుపేట అంటే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలా ఉండేది. ఎన్టీఆర్ హయాంలో ఇక్కడ పార్టీ ఒక వెలుగు వెలిగింది. 1983 నుండి 1999 వరకు కొండల శివప్రసాదరావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ క్రియేట్ చేశారు. కానీ 2004 నుండి సీన్ రివర్స్ అయింది. కోడెల వరుసగా రెండు దఫాలు ఓడిపోయారు. ఆ తర్వాత సీటు వేరొకరికి ఇచ్చినా 2014, 2019 ఎన్నికల్లో కూడ పార్టీ ఓటమిపాలైంది.
ఈ వరుస ఓటములతో ఇక టీడీపీ కోలుకునే ప్రసక్తే లేదనుకున్నారు చాలామంది. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన చదలవాడ ఆనంద్ బాబు మాత్రం ప్రయత్నం వీడలేదు. అందరిలా వెన్ను చూపలేదు. ఓడిన మరుసటిరోజు నుండే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆనంద్ బాబుకు నియోజకవర్గంలో మంచి పేరే ఉంది. అవినీతిరహితుడనే ఫీడ్ బ్యాక్ ఉంది. ఆయనే ముందుండి పార్టీని నడిపిస్తుండటంతో గతంలో పార్టీకి దూరమైన వర్గాలు సైతం చేరువవుతున్నాయట. నిత్యం జనంలో ఉంటూ, సమస్యలను తెలుసుకుంటూ సొంతగా వాటిని పరిష్కరించడమో, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమో చేస్తున్నారు ఆనంద్ బాబు. దీంతో పార్టీ పుంజుకుంటున్న ఛాయలు కనిపిస్తున్నాయట. చంద్రబాబు సైతం నరసారావుపేటలో పార్టీ పురోగతిని చూసి సంతృప్తిగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కూడ ఆనంద్ బాబుకే టికెట్ ఇస్తారని, ఈ దఫా గెలిచే అవకాశాలు పెరిగాయని చెప్పుకుంటున్నారు.