జగన్ కు జడ్ క్యాటగిరి …సిద్దమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు

కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జడ్ క్యాటగిరి భద్రత కేటాయించారు. అందులో భాగంగానే ఆరు బుల్లెట్ ప్రూఫ్ కార్లు సిద్ధమయ్యాయి.  భద్రత చర్యల్లో భాగంగా ఆరు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకూ రవాణా శాఖ ఒకటే నెంబర్ ఏపి 18 పి 3418 కేటాయించింది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇదే జగన్ కు సరైన వాహన శ్రేణిని కేటాయించమని వైసిపి ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు. అందుకనే డొక్కు వాహనాలతోనే జగన్ దాదాపు మూడేళ్ళు నెట్టుకొచ్చారు.

వైసిపి అధికారంలోకి వస్తోందని అర్ధమైపోగానే చీఫ్ సెక్రటరీ వెంటనే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సిద్ధం చేసేశారు. మొత్తం ఆరు వాహనాలు సిద్ధమయ్యాయి.  అమరావతి పరిధిలోని తాడేపల్లి జగన్ ఇంటి పరిసర ప్రాంతాలను పోలీసులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. రాకపోకలను పోలీసులు పూర్తిగా నియంత్రిస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ కు వై క్యాటగిరి భద్రత ఉన్నట్లు వైసిపి వర్గాలు చెప్పాయి. ముఖ్యమంత్రి కాగానే  భద్రత స్ధాయిని వై నుండి జడ్ క్యాటగిరికి పెంచినట్లు పోలీసు ఉన్నతాధికారులు కూడా వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం జగన్ వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయేవి. అందులో ఏసి సౌకర్యం కూడా సరిగా ఉండేది కాదు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవ్వటమంటే ఏపిలో తాజా రాజకీయాలను చూస్తే అర్ధమవుతుంది ఎవరికైనా .