తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టు బోర్డు ఛైర్మన్ గా మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డిని నియమించాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు సమాచారం. ఉత్తర్వులు ఇవ్వటమే ఆలస్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో ఒంగోలు నుండి ఎంపిగా గెలిచిన వైవికి మొన్నటి ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వలేదు. అందుకనే ఇపుడు కీలకమైన టిటిడి ఛైర్మన్ పదవిని ఇవ్వబోతున్నారట.
మొన్నటి ఎన్నికల్లో వైవికి ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీని గెలిపించే బాధ్యతను జగన్ అప్పగించారు. దానికి తగ్గట్లే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ సీట్లలో వైసిపికి ఏకంగా 27 సీట్లు గెలుచుకుంది. అలాగే రెండు జిల్లాల్లోని ఐదు లోక్ సభ స్ధానాల్లోను విజయం సాధించింది.
పై రెండు జిల్లాల్లో పార్టీ సాధించిన విజయాల్లో వైవి పాత్ర కూడా ఉందనేది వాస్తవం. రెండు జిల్లాల్లోని అభ్యర్ధుల విజయానికి నేతలను సమన్వయం చేసే బాధ్యతను వైవి సమర్ధవంతంగానే నిర్వహించారు. దాంతోనే పార్టీకి అఖండ విజయం సాధ్యమైంది. దానికి తోడు జగన్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు కదా ? అందుకనే వైవి కీలక పోస్టు ఆశిస్తున్నారు.
అందులో భాగంగానే టిటిడి ఛైర్మన్ అడిగారని సమాచారం. జగన్ కూడా రెండో ఆలోచన లేకుండా సానుకూలంగా స్పందించారట. ఈ మేరకు వైవితో మాట్లాడిన జగన్ ఛైర్మన్ గా నియమించాలని నిర్ణయించారని సమాచారం. బహుశా ఒకటి రెండు రోజుల్లో నియామకం పూర్తవుతుందని అంటున్నారు.