అడ్రస్ లేని వైవి.. ఎక్కడున్నారు ?

ఒంగోలు మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి ఎక్కడున్నారో అర్ధం కావటం లేదు. ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న సమయంలో కూడా ఆయన ఆచూకీ ఎవరికీ తెలియటం లేదు. ఒంగోలు ఎంపిగా తనకు అవకాశం రాకపోవటం వల్లే వైవి అలిగిన విషయం అందరికీ తెలిసిందే. వైవి స్ధానంలో టిడిపి ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని పార్టీలోకి తీసుకుని ఎంపి టికెట్ ఇచ్చారు. తనకు టికెట్ రాదని తెలుసుకుని, మాగుంటకే టికెట్ ఖాయమని అర్ధమైపోయిన దగ్గర నుండి వైవి అడ్రస్ లేకుండా పోయారు.

టికెట్ కోసం చివరి నిముషం వరకూ తీవ్రంగా ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కూడా అయిన వైవి కుటుంబపరంగా కూడా జగన్ పై ఒత్తిడి తెచ్చారు. అయినా జగన్ లొంగలేదు. దాంతో తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేసినా ఫలితం కనబడలేదు. మాగుంట వైసిపిలో చేరేంత వరకూ నేతలకు వైవి అందుబాటులోనే ఉన్నారు. ఎప్పుడైతే మాగుంట పార్టీలో చేరారో అప్పటి నుండో వైవి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. నామినేషన్ల దాఖలకు గడువు కూడా ముగుస్తోంది. అదే సమయంలో జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అప్పుడు కూడా వైవి ఎక్కడా  కనబడలేదు. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే వైసిపితో వైవి సంబంధాలు పూర్తిగా తెంచుకున్నట్లే కనిపిస్తోంది. టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయాలని అనుకున్నా మళ్ళీ ఆ ఆలోచన విరమించుకున్నారు. విచిత్రమేమిటంటే అసెంబ్లీ అభ్యర్ధులు కూడా వైవిని పట్టించుకున్నట్లు లేదు. అయితే పార్టీలో మాత్రం  వైవి కనిపించకపోవటంపై చర్చ జరుగుతోంది.