యుగపురుషుడే.! కానీ, వెన్నుపోటు బాధితుడు.!

స్వర్గీయ నందమూరి తారక రామారావుని యుగ పురుషుడిగా కొందరు అభివర్ణిస్తారు. అందులో నిజం లేకపోలేదు. ‘బతికితే స్వర్గీయ ఎన్టీయార్‌లా బతకాలి..’ అనే భావన చాలామందిలో వుంటుంది. కానీ, ‘ఎన్టీయార్‌కి వచ్చిన చావు పగవాడిక్కూడా రాకూడదు..’ అని కూడా చాలామందికి అనిపిస్తుంటుంది.

పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు.! చెరిపేస్తే చెరిగిపోయేది కాదిది. ఇది నిజం. రాజకీయంగా స్వర్గీయ ఎన్టీయార్‌ని చంద్రబాబు ఎంత దారుణంగా వెన్నుపోటు పొడిచారో, స్వయానా బాధితుడైన ఎన్టీయారే చాలా సందర్భాల్లో చెప్పారు.

దేశ రాజకీయాలు ఆశ్చర్యపోయేలా పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి అయ్యారు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్. ఆయన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేసింది చంద్రబాబే. చరిత్ర అంటే, అందులో అన్నీ వుండాలి. నిజాలు మాత్రమే వుండాలి.!

‘ఔను, తప్పలేదు.. ఎన్టీయార్ దారి తప్పారు.. పార్టీని స్వాధీనం చేసుకున్నాం..’ అని చంద్రబాబు ధైర్యంగా చెప్పలేరు. ఎందుకంటే, స్వర్గీయ ఎన్టీయార్‌ని ఇప్పుడు రాజకీయ అవసరాల నిమిత్తం దేవుడిలా కొలుస్తున్నారు కాబట్టి.

టీడీపీ ఓటు బ్యాంకు అంటే ఎప్పటికీ ఎన్టీయార్ అభిమానులే.. అందునా ‘కమ్మ’టి సామాజిక వర్గం అండదండలూ వుండాలి. అందుకే, ఎన్టీయార్ భజన. చిత్రమైన విషయమేంటంటే, స్వర్గీయ ఎన్టీయార్ దారుణ వెన్నుపోటుకి గురయ్యారని అందరికీ తెలుసు.

అదే రాజకీయం.! ప్రజా కోర్టులో తనదే విజయమని చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ఓడిపోయిందెవరు.? ఎన్టీయారే కదా.!