‘ఎమ్మెల్యేల పని తీరు బాగోకపోతే మొహమాటమే లేదు.. టిక్కెట్లు ఇవ్వడం కుదరదు..’ అని పదే పదే చెప్పినా, వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది తమ పని తీరు మార్చుకోలేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ సహా అనేక కార్యక్రమాలతో ప్రజా ప్రతినిథులు, ప్రజలకు చేరువయ్యేందుకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.
కానీ, చాలామంది ప్రజా ప్రతినిథులు, ప్రజలతో మమేకం అవలేకపోయారు. సాక్షి అనుకూల మీడియాలో జరిగిన ప్రచారానికీ, వాస్తవ పరిస్థితులకీ చాలా తేడా. అందుకే, సగానికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇంకోసారి తమ తమ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.
అయితే, ఎమ్మెల్యేలు కొందరు లోక్ సభకు వెళ్ళేందుకు అభ్యర్థిత్వం దక్కించుకోవడం, ఎంపీలేమో అసెంబ్లీకి వెళ్ళేందుకు అవకాశం దక్కించుకోవడం.. ఇది కూడా తప్పుడు సంకేతాలు పంపుతోంది క్యాడర్‌కి.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌నే తీసుకుంటే, సొంత జిల్లాలో వైసీపీకి చెందిన ఇతర ముఖ్య నేతలతో ఆయనకు పంచాయితీ వుంది. ఆ కారణంగా ఆయన్ని జిల్లా అవతలకు పంపించేసి, వేరే జిల్లా నుంచి లోక్ సభకు పంపాలనుకుంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఇలాంటి నియోజకవర్గాలు ఓ ఐదారు కనిపిస్తున్నాయ్.. లోక్ సభకు సంబంధించి. ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు సంగతి సరే సరి.! ఏం చేసినా, జనం తన బొమ్మ చూసి ఓటేస్తారని వైఎస్ జగన్ బలంగా నమ్ముతున్నారా.? అదే నిజమైతే, అసలు అభ్యర్థుల మార్పే అనవసరం.
‘అభ్యర్థులు దొరక్క ఈ సర్దుపోట్లు..’ అనే భావన క్యాడర్‌లోకి వెళ్ళడం వైసీపీకి అస్సలు మంచిది కాదు.! కానీ, డ్యామేజీ చాలానే జరిగిపోయింది ఇప్పటికే.!