‘తెలుగుదేశం పార్టీ పనైపోయింది..’ అని వైసీపీ బలంగా నమ్ముతోంది. అధికార వైసీపీ, ‘వై నాట్ 175’ అనడానికి కారణం కూడా అదే. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరక్కపోవచ్చన్నది వైసీపీ ముఖ్య నేతలు పలు సందర్భాల్లో చెప్పిన మాట.
జనసేన విషయంలో వైసీపీ అంచనాలు ఒకింత ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నాయి. ‘టీడీపీకి అమ్ముడుపోయిన జనసేన.. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్..’ అంటూ పదే పదే వైసీపీ ఆరోపిస్తోంది. తద్వారా జనసేన కంటే టీడీపీ పెద్ద పార్టీ అనే విషయాన్ని వైసీపీ బలంగా రుద్దే ప్రయత్నం చేస్తోంది. నిజానికి, వైసీపీ ఆలోచనల్లో టీడీపీ కంటే జనసేననే పెద్ద పార్టీ. అందుకే, నైతికంగా జనసేన బలాన్ని తగ్గించేందుకు.. టీడీపీకి అమ్ముడుపోయిన జనసేన.. అంటూ ఆరోపిస్తున్నారట వైసీపీ నేతలు. ఇటీవల వెలుగు చూసిన చాలా సర్వేల్లో చాలా చోట్ల వైసీపీని బలంగా జనసేన పార్టీనే ఢీకొనబోతున్నట్లు తేలింది.
ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, ఉత్తరాంధ్రలోనూ జనసేన పార్టీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు 50 నియోజకవర్గాల్లో వైసీపీ మొదటి స్థానంలో వుంటే, జనసేన రెండో స్థానంలోనూ, టీడీపీ మూడో స్థానంలోనూ కనిపిస్తున్నాయట. టీడీపీ – జనసేన కలిస్తే.. వైసీపీ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. అందుకే, టీడీపీ – జనసేన కలవకూడదన్నది వైసీపీ వ్యూహం. ‘దమ్ముంటే సింగిల్‌గా పోటీ చేయండి’ అని వైసీపీ అధినేత సహా వైసీపీ నేతలంతా జనసేనకు సవాల్ విసురుతున్నదీ అందుకే.
ఈ విషయమై టీడీపీ కూడా ఖచ్చితమైన అవగాహనతోనే వుంది. అందుకే, జనసేన ప్రభావాన్ని చిన్నదిగా చూపేందుకు తన అను‘కుల’ మీడియాని టీడీపీ రంగంలోకి దించింది.